. బడ్జెట్‌లో కోత దుర్మార్గం
. మోదీ సర్కారును గద్దె దించుదాం
. కాంగ్రెస్‌కు పట్టువిడుపులు అవసరం
. బీకేఎంయూ మహాసభలో డి.రాజా
. పేదలను మోసగిస్తున్న కేంద్రం: నితీశ్
పాట్నా: మోదీ సర్కారు పేదలు, వ్యవసాయ కూలీలు, రైతులను మోసం చేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. మోదీ అధికారం చేపట్టి 9 ఏళ్లు గడిచినా పేదలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. వ్యవసాయ కూలీలకు పట్టెడన్నం పెట్టే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగహ్రం వెలిబుచ్చారు. భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్(బీకేఎంయూ) జాతీయ 15వ మహాసభలు గురువారం పాట్నాలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు భారీగా వ్యవసాయ కూలీలు, పేదలు తరలివచ్చారు. అతిథులుగా నితీశ్‌కుమార్‌తో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్‌జిత్ కౌర్, బీకేయంయూ జాతీయ నాయకులు నాగేంద్రనాథ్ ఓరaా, బీకేయంయూ జాతీయ అధ్యక్షులు పెరియాస్వామి, ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా, నిర్మల్, సీపీఐ బీహార్ రాష్ట్ర కార్యదర్శి రామ్‌నరేశ్ పాండే హాజరయ్యారు. రాజా మాట్లాడుతూ ఉపాధి హామీకి సంబంధించి బడ్జెట్‌లో నిధులపై పూర్తిగా కోత విధించారని మోదీపై నిప్పులు చెరిగారు. పేదల సమస్యలపై రాజీలేని పోరాటలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో మోదీ సర్కారును గద్దె దించడానికి వామపక్ష, లౌకిక, ప్రజాస్వామికశక్తులు ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించారు. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నించాలని, పట్టువిడుపులు ప్రదర్శించాలని హితవు పలికారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా బీజేపీని ఓడిరచడం కష్టమవుతుందన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తించాలన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పేదలను అడుగడుగునా మోసం చేస్తున్నదని, విభజించి`పాలించు నినాదంతో మోదీ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మోదీ సర్కారును గద్దె దించే లక్ష్యంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడ్డాయని చెప్పారు. పేదలు, వ్యవసాయకూలీలు బీజేపీ హటావో దేశ్ బచావో అంటూ నినదిస్తున్నారని చెప్పారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరుపై నీతీశ్ కుమార్ అసంతృప్తి వెలిబుచ్చారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్ నిమగ్నమైందని, విపక్షాల కూటమి(ఇండియా)పై పెద్దగా దృష్టి పెట్టడం లేదని మర్శించారు. కాంగ్రెస్ వల్లే ‘ఇండియా’ కూటమి దూకుడు కొనసాగించలేక పోతోందని నితీశ్‌కుమార్ చెప్పారు. బీజేపీ, మోదీ సర్కారుపైనా నితీశ్‌కుమార్ విరుచుకుపడ్డారు. దేశ చరిత్రను మార్చేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నాలుగు దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీలతో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మొదటిసారిగా తాను ఎన్నికల బరిలో దిగిన సమయంలో సీపీఐ, సీపీఎం తన విజయానికి కలిసి పని చేశాయన్నారు. బీహార్‌లో కమ్యూనిస్టుల ప్రగతిశీల దృక్పథాన్ని ఎంతో కీర్తించేవారమని, అప్పట్లో వారి ర్యాలీల్లో ఎంతోమంది మహిళలు పాల్గొనేవారని నితీశ్ కుమార్ గుర్తుచేశారు. గుల్జార్ సింగ్ గోరియా, నాగేంద్రనాథ్ ఓరaా తదితరులు మాట్లాడారు.
సాయంత్రం ప్రతినిధుల సభను డి.రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఉద్యమ నేపథ్యం తమిళనాడు వ్యవసాయ కార్మికసంఘం నుండి ప్రారంభమైందన్నారు. తమిళనాడు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశానని, గుజ్జుల యలమందరెడ్డి, పీకే కొడియన్, నాగేంద్రనాథ్ ఓరaా వంటి నాయకులతో తనకు అనుబంధం ఉందన్నారు. వ్యవసాయ కూలీలు ఆదివాసీలు, దళితులేనన్నారు. వారికి ఇళ్లు, సాగుభూములు ఉండవన్నారు. అలాంటి వర్గాల కోసం మనం పనిచేస్తున్నామని చెప్పారు. మోదీ ప్రభుత్వానికి రిమోట్ అంతా ఆర్‌యస్‌యస్ అని అన్నారు.పేద వర్గాల కోసం ఉద్యమాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం, ఆర్థికంగా, రాజకీయంగా పేదలను చైతన్యవంతం చేయడానికి బీకేఎంయూ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీపీిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాండా, నాగేంద్రనాథ్ ఓరaా, ఏఐకేయస్ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, ఏఐవైయఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షవర్గం, స్టీరింగ్ కమిటీ, తీర్మానాలకమిటీ, మినిట్స్ కమిటీ, అర్హతలకమిటీని ఎన్నుకున్నారు. మినిట్స్ కమిటీ కన్వీనర్‌గా ఆంధ్రప్రదేశ్ నుండి ఆవుల శేఖర్‌ను ఎన్నుకున్నారు. మహాసభలకు ఆంధ్రప్రదేశ్ నుండి ఆవుల శేఖర్‌తోపాటు డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఆర్.వెంకట్రావు, బి.కేశవరెడ్డి చిలుకూరి వెంకటేశ్వరరావు, టి.కిష్టప్ప, ఆర్.విజయ, పండు గోలమని, పెద్దయ్య, శ్రీధర్, నాగుల్ మీరా, కృష్ణయ్య, ఎం.నబీ రసూల్, వసంతరావు, భూపేశ్, ఏసులు, రామారావు, తెలంగాణ నుండి ప్రధాన కార్యదర్శి యన్.బాలమల్లేశ్, తాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.