ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్… నేడు విచారణ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుపై సీఐడీ మోపిన అభియోగాలు నిరాధారమని పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకుండానే రిమాండ్ రిపోర్టులో ఏ 37గా పేర్కొంటూ సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోందన్నారు. దురుద్దేశపూ ర్వకంగానే ఈ కేసు నమోదైందని సుబ్బారావు తన పిటిషన్‌లో వివరించారు. ఈ అంశంపై విచారణ జరిపి చంద్రబా బుకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు వెల్లడిరచింది. పిటిషన్‌కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ సీఐడీకి నోటీసులు జారీ చేసింది. రెండ్రోజుల క్రితం చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త మహేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ సరిగా లేకపోవడంతో ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. అయితే న్యాయవాది సుబ్బారావు దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది.
అంగళ్లు ఘటనపై బెయిల్ పిటిషన్ 20కి వాయిదా
అన్నమయ్య జిల్లా అంగళ్లు ఘటనలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కేసు పూర్తి వివరాలతో హాజరుకావాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో అంగళ్లు వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీ కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారని చంద్రబాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. తన సెక్యూరిటీ సిబ్బంది కాపాడారని తెలిపారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లులో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు 179 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే చంద్రబాబును ఏ-1గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.