సిలబస్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం
1000 పాఠశాలలకు బోర్డు గుర్తింపు
విద్యార్థుల అవస్థలు…పరీక్షల సన్నద్ధతపై అనుమానం
విశాలాంధ్ర బ్యూరో- అమరావతి : విద్యావ్యవస్థలో వివిధ సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని ఆర్భాటంగా చెబుతున్న జగన్ సర్కారుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సీబీఎస్‌ఈ, బైజూస్, ఐబీ, టోఫెల్ వంటి విధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాటి అమలు తీరు గందరగోళంగా మారింది. ప్రధానంగా సీబీఎస్‌ఈ విధానానికి ఆదిలోని అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం (2023-24) నుంచి చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టి… ఆ దిశగా వార్షిక పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 40 వేల వరకు ఉన్నాయి. ఇందులో వెయ్యి పాఠశాలలకు సీబీఎస్‌ఈ బోర్డు గుర్తింపునిచ్చింది. ఆ దిశగా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధత చేయడంలో వెనుకబాటు కనిపిస్తోంది. కేవలం పాఠశాలలు సీబీఎస్‌ఈ గుర్తింపు పొంది…సిలబస్ అమలు చేయడం వల్ల సత్ఫలితాలు ఉండబోవని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు మేలు కంటే నష్టమే అధికంగా జరుగుతోందని వక్కాణిస్తున్నారు. సీబీఎస్‌ఈ విధానంలో ఎనిమిదో తరగతి నుంచి బేసిక్ విధానం ప్రారంభమై, పదో తరగతి వరకు కొనసాగుతుంది. ఆయా తరగతులకు అనుగుణంగా సబ్జెక్టులలో సిలబస్‌ను పెంచుకుంటూ పోతారు. సీబీఎస్‌ఈ సిలబస్ విధానం పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అంతకుముందు తెలుగు మాధ్యమంలో ఉన్న విద్యార్థులు కొందరు సీబీఎస్‌ఈ సిలబస్‌లోకి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వారు కష్టపడాల్సి ఉంది. ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించి సీబీఎస్‌ఈ బోర్డు విధానంలో పరీక్షలకు విద్యార్థులను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది.
సీనియర్ ఉపాధ్యాయుల కరువు
ప్రైవేట్ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానంతో బోధిస్తున్న తీరు కాస్త మెరుగ్గానే ఉంటుంది. ఎంతోకాలం నుంచి సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో అందుకు తగిన ఉపాధ్యాయులు, ల్యాబ్, లైబ్రరీ తదితర సదుపాయాలు ఉంటాయి. బోర్డు పరీక్షలకు అనేకమార్లు విద్యార్థులను తీర్చిదిద్దిన సీనియర్ ఉపాధ్యాయులు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉన్నారు. దాంతో అక్కడ సీబీఎస్‌ఈ విధానంలో సిలబస్ బోధించే ప్రక్రియ సులువుగా ఉంటుంది. అక్కడ విద్యార్థులు ప్రైమరీ నుంచి ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానానికి త్వరగా దగ్గరవుతున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం వల్ల తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చేవాళ్లు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. ప్రధానంగా 9,10 తరగతుల వారికి బోర్డు సిలబస్‌తో నిర్వహించే పరీక్షలను వారు ఎదుర్కోవడం అసాధ్యంగా మారుతోంది. దీంతో పదో తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పూర్తిగా తగ్గే ప్రమాదముంది.
స్టేట్ సిలబస్‌తో విద్యార్థుల ప్రతిభ
ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్ తరగతులను స్టేట్ సిలబస్ ద్వారా చదివిన విద్యార్థులు ప్రతిష్ఠాత్మక ఐఐటీ, నీట్ విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారు. మొదట స్టేట్ బోర్డ్ సిలబస్ చదివి, ఆ తర్వాత సీబీఎస్‌ఈ విధానంలోకి వచ్చిన విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను నియమించాలి. ఆ సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. సిలబస్‌ను ఉపాధ్యాయులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకుంటే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సీబీఎస్‌ఈ విధానానికి అడ్డంకులు తప్పవు. అందువల్ల సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన పాఠశాలల ఉపాధ్యాయులతో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి, వారిని సీబీఎస్‌ఈ విధానానికి అనుగుణంగా తీర్చేదిద్దాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.