Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

సీఐడీ కస్టడీకిచంద్రబాబు

. రెండు రోజులకు అనుమతి
. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
. న్యాయవాది సమక్షంలో రాజమండ్రి జైలులో విచారణ
. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు
. క్వాష్‌ పిటిషన్‌ తిరస్కరించిన హైకోర్టు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. సీఐడీ ఐదు రోజులు కోరగా కోర్టు మాత్రం రెండురోజులకే అనుమతిచ్చింది. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన తర్వాత ఏసీబీ కోర్టు మధ్యాహ్నం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. రెండు రోజులుగా సీఐడీ కస్టడీ, క్వాష్‌ పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగింది. రాజమహేంద్రవరం జైలులోనే చంద్రబాబును విచారణ చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా ప్రతి గంటకూ 5 నిముషాలు విరామం ఇవ్వాలని, భోజనానికి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు విరామం ఇవ్వాలని, అలాగే న్యాయవాదుల సమక్షంలోనే చంద్రబాబు విచారణ జరగాలని షరతు విధించారు. విచారణ మొత్తాన్ని వీడియో తీయాలని సూచించారు. విచారణకు సంబంధించిన వివరాలు, ఫొటోలు మీడియాకు వెల్లడిరచకూడదని కోర్టు హెచ్చరించింది. చంద్రబాబు వయసు, ఆరోగ్య రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో నిధులు ఎటు మళ్లించారనే దానిపై విచారించాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది వెలుగులోకి వస్తాయని ఏసీబీ కోర్టుకు సీఐడీ తరుపు న్యాయవాదులు విన్నవించారు. సీఐడీ తరపు న్యాయవాదుల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించడంతో చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.
రేపటి వరకు రిమాండ్‌ పొడిగింపు
చంద్రబాబు 14 రోజుల రిమాండ్‌ శుక్రవారంతో ముగియడంతో కోర్టు తదుపరి ఆదేశాల కోసం రాజమహేంద్రవరం జైలు అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో చంద్రబాబుని హాజరుపరిచారు. ఈ సందర్భంగా రాజమండ్రి జైలు అధికారులు రిమాండ్‌లో మీకేమైనా ఇబ్బందులు కలిగించారా అని చంద్రబాబును జడ్జి ప్రశ్నించారు. ఎల్లుండి వరకు జ్యూడిషియల్‌ కస్టడీలోనే ఉంటారని తెలిపారు. మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోందని తెలియజేయగా, తనను అకారణంగా జైల్లో పెట్టారని, తన బాధ, ఆవేదనంతా అదేనని చంద్రబాబు చెప్పారు. తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసునని చెప్పారు. దీనికి జడ్జి స్పందిస్తూ మీరు చెప్పిన విషయాలు నోట్‌ చేసుకున్నానని తెలిపారు. రిమాండ్‌ను శిక్షగా భావించవద్దని, ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమమని తెలియజేస్తూ రిమాండ్‌ను ఈనెల 24వ తేదీ వరకు పొడిగించారు.
క్వాష్‌ పిటిషన్‌ తిరస్కరించిన హైకోర్టు
మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. రెండుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు వెలువరిస్తూ చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ తీర్పు వెలువడిన కొద్దిసేపటికే ఏసీబీ కోర్టు చంద్రబాబుని విచారణ నిమిత్తం రెండు రోజుల సీఐడీ కస్టడీకి అనుమతిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img