. రాజమండ్రి నుంచి తెల్లవారురaామున ఉండవల్లికి…
. కుటుంబ సభ్యుల భావోద్వేగం
. హైదరాబాద్‌లో టీడీపీ శ్రేణులు, ఐటీ ఉద్యోగుల భారీ స్వాగతం
. నేడు ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షలు, కంటి ఆపరేషన్ నిమిత్తం బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా గన్నవరంలో ఘన వీడ్కోలు పలకగా, హైదరాబాద్‌లో టీడీపీ శ్రేణులు, ఐటీ ఉద్యోగులు శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీతో జూబ్లీ హిల్స్ నివాసానికి వెళ్లారు. గురువారం ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన దాదాపు 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు మంగళవారం హైకోర్టు ఆరోగ్య కారణాల రీత్యా నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ ఉత్తర్వులు వెలువడిన అనంతరం చంద్రబాబు మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఉండవల్లి వచ్చేందుకు రాజమహేంద్రవరంలో బయలుదేరగా దారి పొడవునా టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో ఘనస్వాగతం పలకడంతో ఆయన ఉండవల్లి చేరుకోవడానికి 13 గంటల సమయం పట్టింది. బుధవారం ఉదయం తెల్లవారురaామున 5 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో కూడా అమరావతి రైతులు కరకట్ట నుంచి ఇంటి వరకు దారి మార్గం పొడవునా పూలు పరిచి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు ఇంటికి చేరుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కేసులో అక్రమంగా ఇరికించారంటూ చంద్రబాబును కుటుంబ సభ్యులు ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. వారికి ఆయన ధైర్యం చెప్పారు. అంతా మంచే జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని సూచించారు. తొలుత ఇంటికి చేరుకున్న అనంతరం సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పూజలు నిర్వహించారు.