Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

చంద్రబాబు అరెస్ట్‌పైరెండోరోజూ రగడ

. టీడీపీ వాయిదా తీర్మానం తిరస్కృతి
. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి ఆందోళన
. ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ వేటు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అసెంబ్లీ సమావేశాల రెండోరోజు కూడా రగడ చోటుచేసుకుంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు చర్చకు పట్టుపడుతూ ఆందోళన చేపట్టారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. సైకో పాలన పోవాలని, చంద్రబాబుపై తప్పుడు కేసు ఎత్తివేయాలని, అరాచకాలకు అడ్డా ఏపీ వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి జోక్యం చేసుకుని రోజూ సభకు అంతరాయం కలిగించడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు కోరుతున్న విధంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ సరైన విధానంలో రావాలని సూచించారు. నిరసన తెలియజేసే హక్కును కాదనమని, కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తూ నినాదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు లాగా తాము కూడా నిందిస్తూ నినాదాలు చేయగలమని, కానీ తాము సభా సంప్రదాయాలు పాటిస్తున్నామన్నారు. తమ సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని హెచ్చరించారు. టీడీపీ సభ్యులు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. నందమూరి బాలకృష్ణ, గద్దె రామమోహన్‌ తదితరులు విజిల్స్‌ తెచ్చి ఊదారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది టీడీపీ కార్యాలయం కాదని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌, ఆయన అవినీతిపై చర్చకు తాము సిద్ధమన్నారు. చర్చ కన్నా రచ్చకే టీడీపీ సభ్యులు ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. చట్టసభలో జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. బాలకృష్ణ తన డైలాగ్‌లు టీడీపీ కార్యాలయంలో చెప్పుకోవాలని సూచించారు. చంద్రబాబు జైలులో, ఆయన కుమారుడు దిల్లీలో ఉన్నందున ఆయన కుర్చీలో కూర్చోవడానికి ఇదే సరైన సమయమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి జోగి రమేశ్‌ మాట్లాడుతూ టీడీపీ సభ్యులకు కనీస అవగాహన లేదని, చంద్రబాబుపై కేసు ఎత్తివేయాలని అసెంబ్లీలో కోరడం విచిత్రంగా ఉందన్నారు. కేసు వ్యవహారం కోర్టులో తేల్చుకోవాలన్నారు. చర్చలో పాల్గొనే ధైర్యం లేకే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇటు టీడీపీ సభ్యుల నినాదాలు, అటు మంత్రుల ఎదురుదాడితో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను ఐదు నిముషాలు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొనడంతో సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు.
అసెంబ్లీకి పాదయాత్రగా…
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పాదయాత్రగా తరలివచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసన తెలుపుతూ తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ అంశంపై పట్టుబడతామని నేతలు స్పష్టం చేశారు. అధికారపక్షం ఎంత దుందుడుకుగా వ్యవహరించినా వెనక్కి తగ్గేది లేదని, శాసనమండలిలోనూ చర్చకు పట్టుబడతామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతిపై అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు ప్రభుత్వానికి స్పీకర్‌ అనుమతిస్తే…తమకూ అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తామన్నారు. అవకాశం ఇవ్వని పక్షంలో మీడియా సమక్షంలో బయట వివరిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img