. రైతుల గురించి ఏనాడూ ఆలోచన చేయలేదు
. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
. పుట్టపర్తిలో రైతు భరోసా నిధుల విడుదల
విశాలాంధ్ర`పుట్టపర్తి / శ్రీ సత్యసాయి బ్యూరో : రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉంద నేది ప్రతి రైతన్నా ఆలోచించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద వరుసగా ఐదో ఏడాది 2వ విడత పెట్టుబడి సాయం నిధులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని 53.53 లక్షల మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ నేరుగా దాదాపు రూ.2,200 కోట్లు జమ చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొ న్నారు. ఈరోజు రేపటి లోపు మన ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన రూ.1,200 కోట్లు నేరుగా ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతాయని, ఇక పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,000 కోట్లు కూడా ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో జమవుతాయని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్, మద్యం, ఇసుక కుంభకోణాలే గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే మంచి స్కీమ్ గుర్తుకు వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ రైతుల గురించి ఆలోచన చేయలేదన్నారు. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలే అని ఆయన ఆరోపించారు. చంద్ర బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసునన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే చంద్రబాబుకు అధికారం కావాలని సీఎం విమర్శించారు.
రైతులు ఇబ్బందులు పడకూడదనే పెట్టుబడి సహాయం కింద రైతులకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం నిధులను అందిస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లలో రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ. 33, 209.81 కోట్లు అందించిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రతి విషయంలో అన్నదాతకు అండగా నిలిచినట్టు చెప్పారు.
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు పెట్టుబడి సహాయం చేయాలన్న ఆలోచన చేయలేదన్నారు. తమ ప్రభుత్వం మాదిరిగా చంద్రబాబు సర్కార్ సంక్షేమం ఎందుకు అందించలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్, తమ ప్రభుత్వానికి ఉన్న తేడా చూడాలని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. తాను సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లో పుష్కలంగా వర్షాలు కురిశాయని… కానీ చంద్రబాబు అధికారంలో ఉన్న సమ యంలో అనావృష్టేనని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్‌ను కూడా అందించలేకపోయారని ఆయన విమర్శించారు.చంద్రబాబు సర్కార్ సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్ పుట్ సబ్సిడిని అందిస్తున్న విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలున్న గిరిజన రైతులకు రైతు భరోసా అందించినట్టుగా సీఎం చెప్పారు. ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతుకు మంచి జరిగేలా చేస్తున్నామన్నారు. ఆర్‌బీకే ద్వారా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. రైతులకు రైతు భీమాను 53 మాసాల్లో రూ. 7582 కోట్లను చెల్లించినట్టుగా సీఎం జగన్ వివరించారు.గత నాలుగేళ్లలో రూ. 60 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. పజలు ఆలోచించాలని, అబద్ధాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ‘చంద్రబాబుకు అధికారం కావాల్సింది కేవలం తాను, తనతోపాటు ఒక గజదొంగల ముఠాకు… ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు… ఇదీ చంద్రబాబు గజదొంగల ముఠా… ఈ గజదొంగల ముఠాకు అధికారం కావాల్సింది రాష్ట్రాన్ని దోచేసేందుకు, దోచుకున్నది పంచుకొనేందుకు కావాలి’ జగన్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరామ్, ఉషాశ్రీ చరణ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎమ్మెల్సీలు మంగమ్మ, వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తిప్పేస్వామి, మాలగుండ్ల శంకర్ నారాయణ, సిద్ధారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్.నాగిరెడ్డి, రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.