Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

సర్వేల గోల

. వైసీపీ, టీడీపీ అత్యుత్సాహం
. పోటాపోటీ ప్రచారం
. ఎన్నికలే లక్ష్యంగా జగన్‌ పాలన
. ప్రజా సమస్యలు పక్కదారి
. ఉద్యోగ, ఉపాధి కల్పన దూరం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఇటీవల జాతీయ సంస్థలు ఇచ్చిన సర్వేలపై ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎవరికి నచ్చిన సర్వేను వారు ప్రచారం చేసుకుంటున్నారు. గెలుపు మాదంటే మాదని చంకలు గుద్దుకుంటున్నారు. సర్వేల గురించి వైసీపీ, టీడీపీ పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి. కొద్ది నెలల్లోనే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. అధికార, ప్రధాన ప్రతిపక్ష నేతలు ఆయా సర్వేలను చూసి మురిసిపోతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీకి 24 లేదా 25 పార్లమెంట్‌ స్థానాలు వస్తాయని ఓ ప్రముఖ సర్వే సంస్థ ఇటీవల వెల్లడిరచింది. మరో సంస్థయితే 20కుపైగా ఎంపీ సీట్లు లభిస్తాయని పేర్కొంది. ఆయా సర్వేలతో జగన్‌ ప్రభంజనమంటూ వైసీపీ నేతలు జోరుగా ప్రచారం చేసుకున్నారు. వైసీపీ సోషల్‌ మీడియా, అనుకూల మీడియాలో పెద్దఎత్తున కథనాలు, చర్చావేదికలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. రాబోయేదీ జగన్‌ ప్రభుత్వమేనని ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించి, ఆర్భాటంగా చెప్పుకున్నారు. ఇది వైసీపీ శ్రేణుల్లో కొంత జోష్‌ నింపింది. ఈ సర్వే అంచనాలు టీడీపీని తీవ్ర నిరాశకు గురిచేశాయి. టీడీపీ నేతలు డీలా పడ్డారు. ఆ సర్వేలపై టీడీపీ అనుకూల మీడియాలో ఎక్కడా ప్రచారం చేయలేదు. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు తదితర అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వైసీపీ పూర్తిగా విఫలమైంది. టీడీపీ సైతం విభజన హామీలపై నోరెత్తిన దాఖలాలు కనిపించడం లేదు. ఎన్నికల ముందైనా రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయత్నించాల్సిన ప్రధాన పార్టీలు సర్వేలపై అత్యుత్సాహం చూపడం ఆక్షేపణీయంగా మారింది. వాస్తవంగా సర్వేలు కొంతమేరకు ప్రజలనాడి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయేమోగానీ…అవీ నిజమనుకోవడం భ్రమే. 2019 ఎన్నికల నాటి సర్వేలను చూస్తే ఇది అవగతమవుతుంది.
ఆ సర్వేతో టీడీపీలో జోష్‌
కాగా, తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఏపీ నుంచి ఎన్డీఏలో చేరబోయే టీడీపీకి 15 ఎంపీ సీట్లు వస్తాయనే సమాచారం వెల్లడైంది. దీనిని టీడీపీ సోషల్‌ మీడియా, ఆ పార్టీ అనుకూల మీడియా పెద్దఎత్తున ప్రచారం చేశాయి. ఇంతకుముందు వైసీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలన్నీ బోగస్‌ అని, అవి ఉద్దేశపూర్వకంగా చేయించుకున్నవే అంటూ టీడీపీ నేతలు వాటిని తోసిపుచ్చారు. ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేతో జోరుగా ఆ పార్టీ నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. దీనిని టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కిందిస్థాయి నేతల వరకు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సర్వేను అధి కార వైసీపీ అనుకూల మీడియాలో ప్రస్తావించలేదు. అయితే ఆ సర్వే…టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 15 సీట్లు వస్తాయని ఎక్కడా నొక్కిచెప్పలేదని, కేవలం ఎన్డీఏ కూట మిలో చేరే టీడీపీకి అంటూ కోడ్‌ చేశారని సోషల్‌ మీడియా వేదికగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ విషయాన్ని టీడీపీ శ్రేణులు గమనించడం లేదు. ఎన్నికల సమయం నాటికి ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరితే అప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ఎన్డీఏ కూటమి కిందకు వస్తాయి. మూడు పార్టీలు కలుస్తాయో…లేదో ఇంకా తెలియదు.
వైసీపీకి ఎదురు దెబ్బ
సర్వేలతో సంబరాలు చేసుకుంటున్న అధికార పక్షానికీ సొంత పార్టీ నుంచి ఎదురు దెబ్బ తగులుతోంది. టికెట్లు రావనే ఆందోళనతో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం, ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ సస్పెన్షన్‌ వేటు వేసింది. వారంతా టీడీపీ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు రావని భావించిన మరో ఇద్దరు వైసీపీ నేతలు టీడీపీ చెంతకు చేరారు. గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు మొదటినుంచి ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. టీడీపీకి ఆయన మద్దతుగా నిలుస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎండగడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వై నాట్‌ 175 నినాదంతో ముందుకెళ్తున్న వైసీపీకి ఇవి పెద్ద తలనొప్పిగా మారాయి. అటు ప్రజా సంక్షేమంపైనే జగన్‌ సర్కారు పూర్తిగా దృష్టి పెట్టి, అభివృద్ధిని విస్మరించిందనే విమర్శలున్నాయి. ఉద్యోగ, ఉపాధి కల్పన చేయలేదంటూ విద్యార్థి, యువజన సంఘాలు తూర్పారబడుతున్నాయి. రాబోయే తొమ్మిది నెలల్లో ఈ సమస్యల పరిష్కారానికి అధికారపక్షం కృషి చేయకుండా కేవలం పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టడంపై సర్వత్రా విమర్శలున్నాయి. జగన్‌ సంక్షేమ పథకాలను ఇప్పటివరకు ఎండగట్టిన టీడీపీ సైతం…యూటర్న్‌ తీసుకొని దానికి మించిన సంక్షేమం ఇస్తామని ప్రచారం చేసుకుంటుంది. టీడీపీ హామీలకు ఎంతవరకు ప్రజా ఆదరణ లభిస్తుందో వేచిచూడాల్సిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత నెలకొంది. అలాంటి బీజేపీ విధానాలను వైసీపీ, టీడీపీ పోటీపడి బలపరుస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కోసం తాము బీజేపీ పక్షాన లేమనే సందేశాలిస్తున్నప్పటికీ అంతర్గతంగా ఆ రెండు పార్టీలు బీజేపీ జపం చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చే ఏ పార్టీకైనా రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. వాటిని వైసీపీ, టీడీపీ నేతలు గుర్తెరిగి ఎంతో కొంత రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేసి, ప్రజల ఆదరణ పొంది అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించాలి. సర్వేలపై ఆధారపడి తమ పార్టీలకు తిరుగులేదనే ధీమాతో ఉంటే, ఎన్నికల ఫలితాలు తిరగబడే ప్రమాదముంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img