Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రండి బాబూ…రండి

ఇంజినీరింగ్‌ సీటు పొందండి..

బీ కేటగిరీ సీట్ల విక్రయం
డీమ్డ్‌, ప్రైవేట్‌లో భారీగా ప్రవేశాలు
ఊపందుకున్న ప్రచారం
నెల తర్వాతే ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌
అభ్యర్థులకు కేటగిరీల వారీగా ర్యాంకులు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : ‘రండి...బాబూ రండి... యాజమాన్య కోటా (బీ కేటగిరి)లో ఇంజినీరింగ్‌ సీటు పొందండి... వసతి గృహం లభ్యం, క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగం నికరం’... అంటూ ప్రైవేట్‌/డీమ్డ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఏపీఈఏపీసెట్‌2022 ఫలితాల ప్రకటనతో ప్రైవేట్‌ యాజమాన్య ప్రచారం ఊపందుకుంది. కన్వీనర్‌ కోటా (ఏ కేటగిరి)లో సీటు పొంది, ఫీజు రీయింబర్స్‌మెంటుకు అర్హత పొందిన విద్యార్థికి ఉచితంగా ప్రభుత్వం విద్యనందిస్తుంది. అదే యాజమాన్య కోటాలో సీటు పొందితే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాదు. దీనిని గమనించిన ప్రైవేట్‌ యాజమాన్యం మార్కెట్‌లో బీ కేటగిరీ సీట్లు విచ్ఛలవిడిగా విక్రయానికి సిద్ధమయ్యాయి. ఆయా ఇంజినీరింగ్‌ కళాశాలల ఎదుట బీ కేటగిరీ, కన్వీనర్‌ కోటా సీట్ల ధరలను బోర్డులలో ఉంచి ప్రచారం చేస్తున్నాయి. ముందస్తుగా కంప్యూటర్‌ బ్రాంచిలో సీటు రిజర్వు చేసుకోవాలని చెబుతున్నాయి.
అదే పద్ధతిలో డీమ్డ్‌, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు పెద్దఎత్తున ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ చేస్తున్నాయి. ప్రత్యేక పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, ఈఏపీసెట్‌ రాసిన విద్యార్థుల సమాచారం తీసుకుని, సీట్ల భర్తీ ప్రక్రియను ముమ్మరం చేస్తున్నాయి. తమ విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా, రాబోయే కౌన్సెలింగ్‌లో సీటు వస్తుందో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్‌ యాజమాన్యం ఒత్తిళ్లకు లొంగిపోయి ముందస్తుగా బీ కేటగిరీ సీట్లకు అడ్వాన్స్‌ చెల్లిస్తున్నారు. డీమ్డ్‌, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో వేలాది మంది విద్యార్థులు లక్షలాది రూపాయలు సొమ్ము చెల్లించారు. కొన్ని డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే తరగతులను ప్రారంభించాయి. దీని ప్రభావం ఏపీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌పై పడనుంది. కౌన్సెలింగ్‌ సమయానికి ఈ ఏడాది కూడా భారీగా ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలిపోతాయని సమాచారం. ఐఐటీ, నిట్‌ కౌన్సెలింగ్‌ జాప్యంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ (ఏపీ ఈఏపీసెట్‌)2022 కౌన్సెలింగ్‌ను జేఈఈఅడ్వాన్స్‌ పరీక్షలు ముగిశాకే నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతేడాది అదే పద్ధతిలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇప్పటికే ఈఏపీసెట్‌ ఫలితాలను ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అభ్యర్థుల స్థానికత, లింగ, కులాల ఆధారంగా వేర్వేరుగా ర్యాంకులను అంతర్జాలంలో అందుబాటులో ఉంచింది. దీంతో అభ్యర్థులకు గతేడాది భర్తీ అయిన సీట్ల ర్యాంకులతో పోల్చి చూసుకుని, ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో చాలా మంది జేఈఈ(మెయిన్స్‌) పరీక్షల్లో అర్హత పొంది జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు.
ఈఏపీసెట్‌2022కు మొత్తం 3లక్షల 111 మంది దరఖాస్తు చేసుకోగా, ఇంజినీరింగ్‌ 2,05,518 మంది, వ్యవసాయం 93,532 మంది, మరో 1061 మంది రెండు విభాగాల్లోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,94,752 మంది హాజరుకాగా, అందులో 1,73,572 మంది అనగా 89.12శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 258 ఇంజినీరింగ్‌్‌ కాలేజీలు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నాయి. అర్హత సాధించిన వారంతా కౌన్సెలింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కౌన్సెలింగ్‌లో కోరుకున్న బ్రాంచి వస్తుందో, లేదో తెలియక ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్‌, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో యాజమాన్యం కోటాలో ముందస్తు సీట్లు రిజర్వు చేసుకుంటున్నారు. జేఈఈ మెయిన్స్‌తో కౌన్సెలింగ్‌ జాప్యం ఏపీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ మరో నెల వరకూ లేనట్టేనని ఇటీవల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడిరచారు. జాతీయ స్థాయిలో నిట్‌, ఐఐటీ ప్రవేశాల కోసం జేఈఈ(మెయిన్స్‌), జేఈఈ(అడ్వాన్స్‌డ్‌)లో అర్హత సాధించిన అభ్యర్థులకు జోసా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. వాటిల్లో అర్హత సాధించిన వారంతా స్థానిక రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్‌ పరీక్షల్లోనూ ర్యాంకులు పొందారు. ముందస్తుగా ఈఏపీసెట్‌ నిర్వహిస్తే, జేఈఈ (మెయిన్స్‌) అభ్యర్థులంతా అందులో సీట్లు నమోదు చేసుకుని, ఆ తర్వాత జేఈఈ కౌన్సెలింగ్‌ సమయంలో ఐఐటీ, నిట్‌కు వెళ్లిపోయే అవకాశముంది. ఆ తర్వాత ఈఏపీసెట్‌ సీట్లలో చాలా ఖాళీలు ఏర్పడి, మళ్లీ ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఆగస్టులో జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) పరీక్షకు ఎన్‌టీఏ ప్రకటన జారీచేసింది. ఆ పరీక్షా ఫలితాలు సెప్టెంబరు మొదటి వారంలో వెల్లడవుతాయి. దీని ఆధారంగా మరో నెల రోజులపాటు సమయం పడుతుంది. పెరిగిన అర్హతా శాతం ఏపీ ఈఏపీసెట్‌2022 ఫలితాల్లో ఇంజినీరింగ్‌ విభాగం అభ్యర్థుల అర్హతా శాతం ఈ ఏడాది పెరిగింది. 2022లో ఇంజినీరింగ్‌ 89.12 శాతం, 2021లో 80.62 శాతం, 2020లో 84.78 శాతం, 2019లో 71.61 శాతం, 2018లో 69.81 శాతం చొప్పున అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ విద్యా సంవత్సరం 1,73,572 మంది అర్హత సాధించగా, 1,48,283 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత సాధించిన వారికి సరిపడా సీట్లు లేవు. ఇప్పటికే డీమ్డ్‌, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో చాలా మంది ప్రవేశాలు పొందారు. ఐఐటీ, నిట్‌లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు, ఇతర రాష్ట్రాల్లో సీట్లు పొందిన వారంతా ఈఏపీసెట్‌లో కౌన్సెలింగ్‌కు దూరమయ్యే పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ వేగవంతంగా నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img