Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

పెల్లుబికిన ప్రజాగ్రహం

విద్యుత్‌ చార్జీల పెంపు, స్మార్ట్‌ మీటర్లపై వామపక్షాల ఆందోళనలు
కేంద్ర సంస్కరణలు అడ్డుకోలేని అసమర్ధుడు జగన్‌: రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారులపై వేస్తున్న భారాలు, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. పది వామపక్ష పార్టీల పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా, పార్టీలకతీతంగా ప్రజలు పాల్గొని నిరసన తెలియజేశారు. విశాఖపట్నం సీతమ్మధార ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌ (ఎన్‌డీ) తదితర వామపక్ష పార్టీల అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని ఎవరైనా ప్రభుత్వాన్ని అడిగారా? కనీసం వైసీపీ ఎమ్మెల్యేలు అయినా అడిగారా? అని ప్రశ్నించారు. ఎవరికీ ఉపయోగం లేని స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని నిలదీశారు. విద్యుత్‌ సర్‌ చార్జీల పేరుతో గజదొంగలా జగన్‌ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా బాదుడే బాదుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన జగన్‌… అధికారం చేపట్టాక అనేకసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్యుత్‌ చార్జీల బాదుడుకు విలవిలలాడుతున్నదని చెప్పారు. విద్యుత్‌ చార్జీల పెంపు సమంజసం కాదని చెప్పడానికి కూడా అందుబాటులో లేని ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. విద్యుత్‌ వినియోగదారుల పక్షాన సీపీఐ నిలబడుతోందని, అందుకే పది వామపక్ష పార్టీలు ఓకే తాటిపైకి వచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయన్నారు. స్మార్ట్‌ మీటర్ల కొనుగోలులోనూ జగన్‌ మాయ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాజస్థాన్‌లో ఒక్కో మీటర్‌ ధర రూ.9600 ఉంటే మన రాష్ట్రంలో రూ.36,976 ఎందుకు వెచ్చిస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ బినామీ కంపెనీల ఖాతాల ద్వారా రాష్ట్ర ప్రజానీకం నుంచి లక్షల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్‌కు తరలుతోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసేది లేదని తెలంగాణ ప్రభుత్వం కరాఖండిగా చెపుతుంటే… చేతకాని దద్దమ్మ జగన్‌ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. ఈ ఆందోళనలు ఇంతటితో అపబోమని, మున్ముందు మరిన్ని ప్రజాపోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.గంగారావు, సీపీఐ ఎంఎల్‌ ఎన్‌డీ జిల్లా కార్యదర్శి ఎం.లక్ష్మి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, వామపక్ష పార్టీల నాయకులు ఎ.విమల, ఎం.కృష్ణారావు, జి.రాంబాబు, జి.అప్పలరాజు, ఎం.సుబ్బారావు, పి.చంద్రశేఖర్‌, కుమారి, సీఎన్‌ క్షేత్రపాల్‌ తదితరులతో పాటు వామపక్ష పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి: రామచంద్రయ్య
పెంచిన విద్యుత్‌ చార్జీలు, ట్రూ అప్‌ చార్జీలు తగ్గించాలని కోరుతూ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల అధ్వర్యాన పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు జరిగాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పి.రామచంద్రయ్య పత్తికొండలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలులో జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్‌.రంగనాయుడు డోన్‌లో, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు నంద్యాలలో పాల్గొన్నారు.
చార్జీలు తగ్గించకుంటే పతనం తప్పదు: జంగాల
పెంచిన విద్యుత్‌ చార్జీలను, సర్దుబాటు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రభుత్వ పతనం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. విద్యుత్‌ చార్జీల పెంపుపై గుంటూరులోని లిబర్టీ ధియేటర్‌ ఎదురుగా ఉన్న విద్యుత్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు కోట మాల్యాద్రి, కె.నళినీకాంత్‌, జిల్లా నాయకులు మేడా హనుమంతరావు, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కమార్‌, సీపీఐ నాయకులు బి.వెంకటేశ్వర రెడ్డి, నూతలపాటి చిన్న, మంగా శ్రీనివాస్‌, దూపాటి వెంకటరత్నం, వామపక్ష నాయకులు సుధ, కార్తీక్‌, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి దోపిడీ: డేగా ప్రభాకర్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై విద్యుత్‌ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు డేగా ప్రభాకర్‌ మండిపడ్డారు. ఏలూరులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో డేగా ప్రసంగించారు. రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్‌ కొండేటి బేబీ, నూజివీడులో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల వెంకటేశ్వరరావు, కొయ్యలగూడెంలో జమ్మి శ్రీనివాసరావు, టీవీఎస్‌ రాజు, కుక్కునూరులో మైసాక్షి వెంకటాచారి, అయితా సురేశ్‌, వేలేరుపాడులో బాడిస రాము, చింతలపూడిలో కంచర్ల గురవయ్య, తొర్లపాటి బాబు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లుబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్‌, తాడేపల్లిగూడెంలో సీపీఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో
ప్రజలకు భారంగా మారిన విద్యుత్‌ చార్జీలను తక్షణమే తగ్గించకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద్దె దింపుతామని వామపక్ష పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి ఎస్పీడీసీఎల్‌ కార్యాలయం వద్ద సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ,రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి.మురళి, నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె.రాధాకృష్ణ, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నదియా, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందారపు మురళి, నగర కార్యదర్శి టి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో
విద్యుత్‌ చార్జీల పెంపు, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును నిరసిస్తూ సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్‌, జనసేన, లోక్‌సత్తా పార్టీల అధ్వర్యాన శృంగవరపుకోట దేవీ కూడలి నుంచి కరెంట్‌ ఆఫీస్‌ వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కామేశ్వరరావు, మద్ది కృష్ణ, డేగల అప్పలరాజు, మోపాడ మధు, షేక్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌జిల్లా
జి.కొండూరు సబ్‌ స్టేషన్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌.కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జగ్గయ్యపేట డిపో సెంటర్‌ వద్ద విద్యుత్‌ కార్యాలయం, సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా కార్యక్ర మాన్ని నిర్వహించి విద్యుత్‌ బిల్లును తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌ పాల్గొన్నారు. విజయవాడ నగరంలోని పాలిటెక్నిక్‌ రోడ్‌లోని విద్యుత్‌ సౌదా వద్ద చేపట్టిన నిరసన కార్యక్ర మంలో సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొ న్నారు. తిరువూరు, ఏకొండూరు, పెనుగంచిప్రోలులో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. కృష్ణాజిల్లా గంగూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి టి.తాతయ్య మచిలీపట్నంలో సీపీఐ నాయకులు మోదుమూడి రామారావు, చల్లపల్లిల్లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు, మొవ్వ మండలం కాజ గ్రామం, గన్నవరంలో ధర్నా కార్యక్రమాలు జరిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img