Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఢీ అంటే ఢీ

అధికార, విపక్షాల నినాదాలు
విమర్శలు, ప్రతివిమర్శలు
ఉభయసభలు వాయిదా

న్యూదిల్లీ: అధికార, విపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలు, గొడవల మధ్య పార్లమెంటు ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ముర్ముపై అధీర్‌రంజన్‌ చౌదరి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని అధికారపక్షం డిమాండ్‌ చేయగా..సోనియాపై అనుచితంగా ప్రవర్తించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కేబినెట్‌ నుంచి తొలగించాలని, మోదీ సర్కారు క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ధరల పెరుగుదల, ఎంపీల సస్పెన్షన్‌ వంటి అనేక అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశాయి. అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభలో ఇవే ఘటనలు చోటుచేసుకున్నాయి. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అధికారపార్టీ సభ్యులు తమ సీట్ల వద్దే నిలబడి ఎదురుదాడికి దిగడం వంటి సన్నివేశాలు కనిపించాయి. మొత్తంమీద రెండు వారాల నుంచి పార్లమెంటు ఉభయసభలు ఎలాంటి చర్చలు లేకుండానే వాయిదా పడుతూ వస్తున్నాయి. అనేక సమస్యలను లేవనెత్తుతూ ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో గందరగోళం సృష్టించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుజరాత్‌లో కల్తీమద్యం మరణాలు, సోనియాపై ఇరానీ అనుచిత ప్రవర్తన వంటి అంశాలను లేవనెత్తారు. దీనికి ప్రతిగా అధీర్‌ రంజన్‌ చౌదరి రాష్ట్రపత్ని వ్యాఖ్యలను అధికార పక్ష సభ్యులు ప్రస్తావించారు. గుజరాత్‌లో కల్తీ మద్యం మరణాలు, కనీవినీ ఎరుగని విధంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. బీజేపీ సభ్యులు మాత్రం సోనియా క్షమాపణ చెప్పాలంటూ అల్లరికి దిగారు. దీంతో డీప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సభను వాయిదా వేశారు. లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అధికార, విపక్ష సభ్యుల డిమాండ్లు, ప్రతిడిమాండ్లతో లోక్‌సభ దద్దరిల్లింది. సభ ప్రారంభమైన తర్వాత గందరగోళం చెలరేగడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడిరది. తిరిగి ప్రారంభమైనా ఇదే పరిస్థితి కొనసాగింది. కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలుపగా సోనియా రాజీనామా కోసం బీజేపీ సభ్యులు పట్టుబట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img