Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నిండా ముంచారు

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ముంపు గ్రామాల్లో సీపీఐ బృందం పర్యటన

విశాలాంధ్ర-వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో వరదముంపునకు గురై తీవ్రంగా దెబ్బతిన్న వివిధ గ్రామాలలో గురువారం సీపీఐ నేతల బృందం పర్యటించింది. బాధితులను పరామర్శించి ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ఓబులేసు, జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్‌, సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మునీర్‌ తదితరులతో కూడిన బృందం మద్దిగట్ల, వసంతవాడ, చాగరపల్లి తదితర గ్రామాలలో వరదకు సర్వం కోల్పోయిన బాధితులు గుట్టలపై, మెరక ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గుడారాలకు నడిచి వెళ్లి వారి పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాల గురించి, వరదల వల్ల చేకూరిన నష్టం, తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బండ్లబోర్లు గ్రామంలో ప్రభుత్వ పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి అక్కడ అధికారులతో, బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అకస్మాత్తుగా గోదావరి వరద రావడంతో ముంపు గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో బయట పడవలసిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఇళ్లల్లో విలువైన సామగ్రి సైతం గోదావరి పాలైందన్నారు. వందల పూరిళ్లు కూలిపోయి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం ఏర్పడిరదని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. తాత్కాలిక గుడారాలలో సరైన వసతులు లేక చిన్నపిల్లలు, వృద్ధులు ఎదుర్కొంటున్న బాధలు వర్ణనాతీతమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు పెద్ద ఎత్తున సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.
గోడు వెళ్లబోసుకున్న పోలవరం నిర్వాసితులు
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు…ప్రభుత్వ తీరుతో తామెదుర్కొంటున్న పరిస్థితులను నేతలకు వివరించారు. 41 కాంటూరు ముందుగా మనుగుతుందని, 45 కాంటూరు పరిధిలోని గ్రామాలు మునగవని అంచనా వేస్తూ ప్యాకేజీకి ఆయా గ్రామాలను రెండో విడతలో చేర్చారని తెలిపారు. గతంలో వచ్చిన వరదల గురించి చెబుతూ మా గ్రామాలు ముందే మునుగుతాయని, పూర్తిగా నష్టపోతామని అనేకమార్లు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఫలితంగా నేడు కట్టుబట్టలతో రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం పెట్టిన కటాఫ్‌ తేదీనే పరిగణనలోకి తీసుకుంటూ ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ప్యాకేజీ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. పూర్తి ప్యాకేజీ ఇప్పించి పునరావాస ప్రాంతానికి వెంటనే తరలించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని సీపీఐ నాయకులు భరోసా కల్పించారు.
నిర్వాసితులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం
పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేస్తోందని నారాయణ ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని వేల కుటుంబాలకు నష్టం చేకూర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపునకు సంబంధించి ప్రభుత్వ అంచనాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మునగవని తేల్చిన గ్రామాలు సైతం ముందే మునగటం ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. స్థానికులు చెప్పింది పట్టించుకోకుండా నిర్వాసితులను నిండా ముంచేశారని దుయ్యాబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ప్రస్తుతం వచ్చిన గోదావరిని అంచనాగా తీసుకొని నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి హేమ శంకర్‌, ఏపీజీఎస్‌ జిల్లా కార్యదర్శి కారం దారయ్య, మండల కార్యదర్శి బాడిశ రాము, జిల్లా కార్యవర్గ సభ్యుడు సన్నేపల్లి సాయిబాబు, రామవరం సర్పంచ్‌ పిట్ట ప్రసాద్‌, ఏఐఎస్‌ఎఫ్‌ మండల కార్యదర్శి ఎర్ర మధు, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పిట్ట వీరయ్య, మడివి కామయ్య, కరటం సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img