Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

కొత్తగూడెం ఎమ్మెల్యే ‘వనమా’ ఎన్నిక చెల్లదు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
విశాలాంధ్ర-హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసినందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు వేటు వేసింది. వనమాను అనర్హుడిగా ప్రకటిస్తూ సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినందుకు గాను వనమాకు రూ .5 లక్షల జరిమానా విధించడంతో పాటు 2018 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా అర్హుడు కాదంటూ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. వనమా తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చారని 2019 జనవరి నుంచి జలగం వెంకట్రావు న్యాయపోరాటం చేస్తున్నారు. వీరిద్దరూ బీఆర్‌ఎస్‌ నేతలే కావడం గమనార్హం. 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచారు. అనంతరం బీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యారు. అప్పట్లో టీఆర్‌ఎస్‌ (ఇప్పుడు బీఆర్‌ఎస్‌) తరపున జలగం వెంకట్రావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర రావు గెలుపును సవాల్‌ చేస్తూ జలగం

వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు నివేదిక సమర్పించారని జలగం ఫిర్యాదులో పేర్కొన్నారు. వనమాపై వచ్చిన ఆరోపణలు నిజమేనని రుజువు కావడంతో సమీప ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. వనమా వెంకటేశ్వరరావు ఫారం`26లో భార్య ఆస్తి వివరాలు, స్థిరాస్తుల వివరాలను నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనకపోవడంపై హైకోర్టులో జలగం వెంకట్రావ్‌ సవాలు చేశారు. ప్రజాప్రాతినిథ్య చట్టం నిబంధనల ప్రకారం వనమా వెంకటేశ్వరరావు పై ఐదేళ్ల అనర్హత కూడా వర్తిస్తుందని జలగం తరపు న్యాయవాది రమేష్‌ తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి వివరాలు వెల్లడిరచనందుకు ఐదు లక్షల జరిమానా కూడా విధించినట్లు వివరించారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావుకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా కోర్టు అనర్హత వేటు వేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
వనమా కుటుంబంపై వ్యతిరేకత
కొద్ది నెలల క్రితం వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ ఓ కుటుంబాన్ని వేధించిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మీ-సేవ నిర్వాహకుడిగా ఉన్న వ్యక్తికి తన సోదరి, తల్లితో ఉన్న ఆస్తి గొడవలు సెటిల్‌ చేయడానికి అతని భార్యను తన వద్దకు పంపమని చెప్పాడు. సదరు బాధితుడు ఈ విషయాన్ని స్వయంగా వీడియో రికార్డు చేసి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో పరారీలో ఉన్న రాఘవను గాలించి అరెస్టు చేసి జైలుకు పంపారు.ఆ తర్వాత వనమా రాఘవకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని, ప్రతీ శనివారం ఖమ్మం పోలీస్‌ స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించింది. సాక్షులను మభ్య పెట్టడం, తారుమారు చేయడం వంటి పనులకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వనమా రాఘవ కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో అసాంఘిక శక్తిగా చెలరేగిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారం మొత్తాన్ని కొడుకు చేతిలో పెట్టడంతో వనమా వెంకటేశ్వరావు అప్రతిష్ఠ పాలయ్యారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పదవిని కూడా కోల్పోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img