Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ఎన్నికల తాయిలం

. వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 తగ్గింపు
. నేటి నుంచి అమలు
. చంద్రయాన్‌`3 ఘనతపై కేంద్రకేబినెట్‌ తీర్మానం ఆమోదం

న్యూదిల్లీ: త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రజ లను తమ ముగ్గులోకి దించే ప్రయత్నాలకు బీజేపీ ప్రభుత్వం పదును పెంచింది. 2020 నుంచి వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర దాదాపు రెట్టింపు అయిన క్రమంలో ప్రధాన పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో ఎల్పీజీ సిలిండర్‌ ధర తగ్గింపు కీలకాంశంగా మారింది. వంట గ్యాస్‌ ధర తగ్గిస్తామన్న హామీని మధ్యప్రదేశ్‌, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఇచ్చింది. మరోవైపు ఇండియా కూటమిగా ప్రతిపక్షాల ఐక్యతతో కాషాయ పార్టీ వెన్నులో వణుకు మొదలైంది. అధిక ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న ప్రజ లకు ఎల్పీజీ ధరలతో భారం మరింత పెరి గింది. ఇదే అంశాన్ని కర్నాటకలో ఎన్నికల అస్త్రంగా కాంగ్రెస్‌ మల్చుకుంది. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే రూ.500కు గ్యాస్‌ సిలిం డర్‌ ఇస్తామన్న హామీనిచ్చింది. నవంబరు` డిసెంబరులో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగను న్నాయి. ఈ నేపథ్యంలో ప్రజావ్యతిరేకత నుంచి బయటపడి ప్రజలను ఆకర్షించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గిస్తున్నట్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఎల్పీజీ సిలిండర్‌ ధరపై రూ.200 తగ్గించాలని మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. బుధవారం నుంచి తగ్గింపు అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం ప్రకటించారు. ఓనం, రాఖీ పండుగలను పురస్కరించుకొని మహిళలకు మోదీ ప్రభుత్వ కానుకగా గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపును వర్ణించారు. అదే సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌`3కి చెందిన ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌ సజావుగా దిగి చరిత్ర సృష్టించినందుకు కేంద్రకేబినెట్‌ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) శాస్త్రవేత్తలను ప్రశంసించింది. ఈ విజయం ఇస్రోదే కాబోదని, భారత పురోగతికి, అంతర్జాతీయ స్థాయికి దేశ ప్రతిష్ఠను పెంచడానికి చిహ్నమని పేర్కొంది. ఈ ఘనత సాధించిన ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినంగా జరుపుకోవాలన్న నిర్ణయాన్ని స్వాగతించింది. దీనిపై తీర్మానాన్ని ఆమోదించింది. ఠాకూర్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటికి కాస్త ఉపశమనం కల్పించడమే ఉద్దేశమన్నారు. అదనంగా 75 ఉజ్వల కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి ఎన్నికలతో సంబంధం లేదని ఠాకూర్‌ తెలిపారు. సిలిండర్‌పై రూ.200 చొప్పున వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఖజానాపై రూ.7,680 కోట్ల భారం (2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు) పడుతుందని ఆయన చెప్పారు. దేశంలో ఉజ్వల లబ్ధిదారులు 9.6 కోట్ల మంది మాత్రమే కాగా 31కోట్ల మంది వంటగ్యాస్‌ వినియోగదారులకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. 2020 జూన్‌ నుంచి ఎల్‌పీజీ సబ్సిడీలను కేంద్రం ఆపేసింది. మార్కెట్‌ ధరకు సిలిండర్‌ విక్రయిస్త్తోంది. చంద్రయాన్‌-3 సాధించిన ఘనతపై కేంద్ర కేబినెట్‌ హర్షం వ్యక్తం చేసినట్లు ఠాకూర్‌ తెలిపారు. శాస్త్రవేత్తల చారిత్రక విజాయానికి తగిన గుర్తింపు ఇవ్వాలని ఆగస్టు 23ను ‘నేషనల్‌ స్పేస్‌ డే’ జరుపుకోవడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. పురోగతి, స్వీయసమృద్ధి, అంతర్జాతీయ నాయకత్వానికే కాదు నవభారత వికాసానికి ఇది చిహ్నమని కేబినెట్‌ పేర్కొన్నట్లు తెలిపారు.
నా సోదరీమణుల కోసమే: మోదీ
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని కుటుంబ సంతోషం పెంచాలనే ఉద్దేశంతో, సోదరీమణులకు మరింత సౌకర్యం కల్పించేందుకు వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరపై రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ మాధ్యమంగా తెలిపారు. ఈ నిర్ణయంతో కుటుంబాల ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.
ఇది ‘ఇండియా’ దమ్ము: మమత
కోల్‌కతా: ఎల్పీజీ సిలిండర్‌ ధరపై రూ.200 తగ్గిస్తుండటం ఇండియా కూటమి ప్రభావం వల్లే అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘ఇండియా కూటమి రెండు నెలల్లో రెండుసార్లు మాత్రమే భేటీ అయింది. ఈలోగా ఎల్పీజీ ధర రూ.200 మేర తగ్గింది. ఇది ‘ఇండియా’కున్న దమ్ము’ అని మమత ట్వీట్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా వంట గ్యాస్‌ ధర తగ్గింపు ఎన్నికల జిమ్మిక్‌ అని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img