Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

శ్రీలంకలో ఎమర్జెన్సీ

ప్రజాగ్రహానికి అధ్యక్షుడు పరార్‌
రాజీనామా చేయకుండా మాల్దీవులు వెళ్లిన గొటబాయ
అక్కడి నుంచే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్‌ నియామకం
అంతా రాజ్యాంగబద్ధమేనంటున్న ప్రభుత్వం
పాలకుల వైఖరిపై మరోసారి పెల్లుబికిన నిరసనలు

కొలంబో: శ్రీలంక సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన పాలకులపై ప్రజల తిరుగుబాటు పతాక స్థాయికి చేరింది. వేల మంది నిరసనకారులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసనలను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజాగ్రహానికి తట్టుకోలేక అధ్యక్షుడు గొటబాయ బుధవారం సైన్యానికి చెందిన ఒక జెట్‌ విమానంలో తన భార్య, భద్రతా సిబ్బందితో కలిసి మాల్దీవులకు పరారయ్యాడు. అయితే తన పదవికి రాజీనామా చేయని 73 ఏళ్ల గొటబాయ, మాల్దీవుల నుంచే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాన మంత్రి రణిల్‌ విక్రమ సింఘేని నియమించారు. శ్రీలంక రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 37(1) ప్రకారం… అధ్యక్షుడు అనారోగ్యంతో లేదా దేశం బయట ఉన్నప్పుడు, ‘అధ్యక్ష పదవికి సంబంధించిన అధికారాలు, విధులను నిర్వర్తించడానికి’ ఒక ప్రధాన మంత్రిని అనుమతిస్తుంది. అధ్యక్షుడు రాజపక్స విదేశాల్లో ఉన్నప్పుడు తన విధులను నిర్వహించేందుకు ప్రధాని విక్రమ సింఘేను నియమించినట్లు పార్లమెంట్‌ స్పీకర్‌ మహింద యాపా అబేవర్దన ప్రకటించారు. హామీ మేరకు తాను బుధవారం రాజీనామా చేస్తానని రాజపక్స తనకు టెలిఫోన్‌ ద్వారా తెలియజేసినట్లు అబేవర్దన తెలిపారు. జులై 20న కొత్త అధ్యక్షుడి కోసం ఓటింగ్‌ జరుగుతుందన్నారు. ఇదిలాఉండగా, ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న విక్రమ సింఘే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కొలంబోలోని ఫ్లవర్‌ రోడ్‌లోని తన కార్యాలయం సమీపంలో నిరసనకారులు గుమిగూడటంతో పశ్చిమ ప్రావిన్స్‌లో కర్ఫ్యూ విధించారు. ‘నేను ఇప్పుడు ఎమర్జన్సీ, కర్ఫ్యూ విధిస్తున్నాను’ అని ఆయన ఒక ప్రత్యేక టెలివిజన్‌ ప్రకటనలో తెలిపారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎమర్జెన్సీ, కర్ఫ్యూను అమలు చేయాలని భద్రతా బలగాలను ఆదేశించినట్లు విక్రమ సింఘే చెప్పారు. రాజకీయ జోక్యం లేకుండా సాయుధ దళాల అధిపతులతో కూడిన కమిటీకి ఈ బాధ్యత అప్పగించినట్లు పేర్కొన్నారు. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుం టానని హామీ ఇచ్చారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో తాను ఆందోళనకు గురయ్యానని చెప్పారు. ‘అధ్యక్షుడు నిష్క్రమించినప్పటికీ, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ, ఆందోళనలో ఉన్న కొన్ని గ్రూపులు ప్రధానమంత్రి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు సంఘటితమయ్యాయి. అధ్యక్షుడు గొటబాయ మాల్దీవులు వెళ్లేందుకు వైమానిక దళ విమానాన్ని అందించిన వైమానిక దళ కమాండర్‌ నివాసాన్ని చుట్టుముట్టాయి. అలాగే నావికాదళ కమాండర్‌ నివాసం, సైనిక కమాండర్‌ నివాసాన్ని చుట్టుముట్టాలని కూడా వారు నిర్ణయించుకున్నారు. ఈ సమూహాలు దేశంపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నించాయి’ అని అన్నారు. అల్లరి చేసేలా ప్రవర్తించే వారిని అరెస్టు చేయాలని భద్రతా బలగాలను ఆదేశించారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు భవనాన్ని చుట్టుముట్టారు. రణిల్‌ విక్రమ సింఘే రాజీనామాకు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. నిరసన కారులు ప్రధాని భవనంపై దాడి చేయడంతో శ్రీలంక ప్రభుత్వ యాజమాన్యంలోని టెలివిజన్‌ ఛానల్‌ రూపవాహిని బుధవారం దాని ప్రసారాన్ని కొద్దిసేపు నిలిపివేసింది. అంతకుముందు, అధ్యక్షుడు గొటబాయ తన భార్య, ఇద్దరు భద్రతా అధికారులతో కలిసి సైనిక జెట్‌లో దేశం విడిచిపెట్టినట్లు శ్రీలంక వైమానిక దళం నుంచి వెలువడిన ఒక సంక్షిప్త ప్రకటన పేర్కొంది. ‘ప్రభుత్వ అభ్యర్థనపై, రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి ఉన్న అధికారాల పరంగా, రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి పూర్తి ఆమోదంతో జులై 13 తెల్లవారుజామున మాల్దీవులకు అధ్యక్షుడు, అతని భార్య, ఇద్దరు భద్రతా అధికారులకు కటునాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి శ్రీలంక వైమానిక దళ విమానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది’ అని ప్రకటన పేర్కొంది. రాజపక్స అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విచారణ నుంచి మినహాయింపు పొందారు. కొత్త ప్రభుత్వం అరెస్టు చేసే అవకాశాన్ని నివారించడానికి రాజీనామా చేయడానికి ముందు దేశం నుంచి పారిపోయారు. ఆయన స్థానిక కాలమానం ప్రకారం దాదాపు 03:00 గంటలకు మాల్దీవుల రాజధాని మాలే చేరుకున్నాడని బీబీసీ నివేదించింది. వెలానా విమానాశ్రయంలో మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధి గొటబాయని తీసుకొని పోలీసు రక్షణలో గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని మాల్దీవుల అధికారులను ఉటంకిస్తూ వర్గాలు తెలిపాయి. అయితే ద్వీప దేశంలో ఆయన ఉనికిపై మాల్దీవుల ప్రభుత్వం ఇంకా అధికారికంగా వ్యాఖ్యానించలేదు. రాజపక్స మాల్దీవులకు పారిపోవ డానికి మాల్దీవుల మజ్లిస్‌ (పార్లమెంట్‌) స్పీకర్‌, మాజీ అధ్యక్షుడు మొహమ్మద్‌ నషీద్‌ చర్చలు జరిపినట్లు మాల్దీవుల రాజధాని మాలేలోని వర్గాలు తెలిపాయి. రాజపక్స ఇప్పటికీ శ్రీలంక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, ఆయన రాజీనామా చేయలేదని లేదా వారసుడికి తన అధికారాలను అప్పగించలేదని మాల్దీవుల ప్రభుత్వ వాదన. అందు వల్ల ఆయన మాల్దీవులకు వెళ్లాలనుకుంటే, దానిని తిరస్కరించలేమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయం పార్లమెంటుకు తెలియదని పార్లమెంట్‌ సెక్రటేరియట్‌లోని కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ హసన్‌ జియావు అన్నారు. రాజపక్స వెంట 13 మంది మాల్దీవులకు వెళ్లారు. మాల్దీవుల్లో సైనిక విమానాన్ని ల్యాండ్‌ చేయాలన్న తొలి అభ్యర్థనలను మాల్దీవుల్లోని పౌర విమానయాన మండలి తిరస్కరించిందని, అయితే స్పీకర్‌ నషీద్‌ అభ్యర్థన మేరకు ల్యాండిరగ్‌కు అనుమతి లభించిందని నివేదికలు చెబుతున్నాయి. అధ్యక్షుడు రాజపక్స బుధవారం తర్వాత సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉందని మాల్దీవుల్లోని వర్గాలను ఉటంకిస్తూ డైలీ మిర్రర్‌ నివేదించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img