Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15 శాతం

సీబీటీ సమావేశంలో నిర్ణయం
పెంపు నామమాత్రం

న్యూదిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను 8.15 శాతం వడ్డీరేటును నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి ఈపీఎఫ్‌ఓ ప్రతిపాదనలు చేసింది. ఇది స్వల్ప పెరుగుదల మాత్రమే. దీనివల్ల ఆరు కోట్లమంది ఖాతాదారులకు నామమాత్రపు ప్రయోజనం చేకూరుతుంది. గత ఆర్థిక సంవత్సరం (8.10శాతం)తో పోలిస్తే ఇది కొంచెం అధికం. సోమ, మంగళవారాల్లో జరిగిన ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.15 శాతం ఇవ్వాలని నిర్ణయించారు. సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీరేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ ఐదు కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీరేటు 8.5 శాతంగా ఉండేది. కానీ ఎన్నడూ లేనివిధంగా గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించిన వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్‌పై ఇదే తక్కువ వడ్డీ రేటు కావటం గమనార్హం.
గడచిన పదేళ్లలో ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లు పరిశీలిస్తే…2011-12లో 8.25 శాతం ఉండగా 2012-13లో అది 8.5 శాతానికి పెరిగింది. 2013-14లో 8.75 శాతం, 2014-15లో 8.75 శాతం, 2015-16లో 8.8 శాతం, 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం, 2018-19లో 8.65 శాతం, 2019-20లో 8.5 శాతం, 2020-21లో 8.5 శాతం, 2021-22లో 8.1 శాతం ఉంది. నాలుగు దశాబ్దాల కాలంలో ఈపీఎఫ్‌పై వడ్డీరేటు అతితక్కువగా 8.1 శాతం ఖరారు చేశారు. 1977`78లో ఈపీఎఫ్‌పై వడ్డీరేటు కేవలం 8 శాతం మాత్రమే. కేంద్ర కార్మికశాఖమంత్రి భూపేందర్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్‌ఓ నిర్ణయాత్మక సంస్థ సెంట్రల్‌ బోర్డు ట్రస్టీ వడ్డీరేటును 8.15 శాతంగా ఖరారు చేసింది. పీఎఫ్‌పై వడ్డీరేటును 8.20 శాతంగా నిర్ణయిస్తే రూ.112.78 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే 8.25 శాతమైతే రూ.438.34 శాతం అవుతుందని సీబీటీ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img