Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

అంతా గందరగోళం

రెండు షెడ్యూళ్లు ఒకేసారి
పీజీ వైద్య విద్యార్థుల అయోమయం
ఏకకాలంలో నీట్‌ పీజీ, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ వర్సిటీ షెడ్యూల్‌

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, ఆల్‌ ఇండియా నీట్‌ పీజీ రిజిస్ట్రేషన్లు కోసం ఏకకాలంలో షెడ్యూల్‌ జారీ చేయడంతో అభ్యర్థులకు దిక్కుతోచడం లేదు. పీజీ మెడికల్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ (2023-24 విద్యాసంవత్సరం) రిజిస్ట్రేషన్లకు ఈనెల 20 నుంచి 23 వరకు గడువు కల్పిస్తూ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ షెడ్యూలు జారీ చేసింది. అదేసమయంలో నీట్‌ పీజీ (మూడో విడత) కౌన్సెలింగ్‌ కోసం ఈనెల 22 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్లకు షెడ్యూలు జారీజేశారు. రాష్ట్రంలోని వివిధ పీజీ వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ వర్సిటీ ద్వారాను, దేశంలోని వివిధ పీజీ వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి ఆల్‌ ఇండియా నీట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా వేర్వేరుగా రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. ఈ రెండు షెడ్యూళ్లు దాదాపు ఒకే సమయంలో ఉండటం వల్ల పీజీ వైద్య సీట్ల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకునే అభ్యర్థులకు అసౌకర్యం కలుగుతోంది. నేషనల్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో అర్హత పొందిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకుని, వారి ర్యాంకును అప్‌లోడ్‌ చేస్తారు. వారిందరికీ ఈనెల 28న ర్యాంకుల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తారు. నీట్‌ పీజీ కోటాలో సీట్లు రాని వారంతా ఏపీలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోని పీజీ వైద్య కళాశాలల్లో రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకుంటారు. ఇవి రెండూ దాదాపు ఒకే సమయంలో షెడ్యూలు ఉండటం వల్ల పీజీ విద్యార్థులపై ఆర్థికభారం పడుతుంది. నీట్‌ ర్యాంక్‌లో జీరో పర్సెంటైల్‌ అర్హత వారు సైతం రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడంతో అభ్యర్థుల సంఖ్య వేలల్లో ఉంటుంది. దానివల్ల రిజిస్ట్రేషన్ల సమయంలో ఆన్‌లైన్ల సమస్యలు తలెత్తే అవకాశముంది. ఆయా కళాశాలల నుంచి అభ్యర్థులు సకాలంలో సర్టిఫికెట్లు తీసుకురాలేకపోవడం వంటి సాంకేతిక కారణాలు తలెత్తే ప్రమాదం ఉంది. వాటితోపాటు ఎంబీబీఎస్‌లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు పాటించకపోవడంపై వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ సంబంధిత రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ రోస్టర్‌ను సరిచేసుకుని పీజీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించి ఉంటే సముచితంగా ఉండేది. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తూ వైద్యులు తలమునకలై ఉన్నారు. ఈ సమయంలో పీజీ రిజిస్ట్రేషన్లకు అతి తక్కువ వ్యవధి ఉండటంతో వారు నష్టపోయే అవకాశముంది. ఈ శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేయవని, అందువల్ల రిజిస్ట్రేషన్ల ఫీజు చెల్లింపునకు ఆటంకం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆల్‌ ఇండియా నీట్‌ పీజీ ఫలితాలు వెలువడిన తర్వాత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img