Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

దద్దరిల్లిన ఫ్యాప్టో ధర్నాలు

. జీవో 117తో విద్యావ్యవస్థ నాశనం: వెంకటేశ్వరరావు
. సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే: ఎస్టీయూ నేత తిమ్మన్న

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి… పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, విద్యావ్యవస్థను నాశనం చేసే జీవో 117ను రద్దు చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో అధ్వర్యాన శనివారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట ఉపాధ్యాయులు ధర్నాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అన్ని ఉపాధ్యాయ సంఘాలకు చెందిన సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగిన కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్‌ ఎన్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలల బోధన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తున్న జీవో నంబర్‌ 117ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని, సకాలంలో డీఏలు ఇవ్వటం, ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలు చేపట్టడం జరగడం లేదని ఆయన విమర్శించారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించే విషయంలో ప్రజాస్వామ్య దృక్పథం కనిపించడం లేదని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో చిత్తశుద్ధి కానరావడం లేదని ఆయన మండిపడ్డారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి హెచ్‌. తిమ్మన్న మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14వేల పాఠశాలలు సింగిల్‌ టీచర్‌తో నడుస్తుండగా, ప్రభుత్వం ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా…ఉన్న పోస్టులను రద్దు చేసే చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపుతూ వేధించడం నిత్యకృత్యంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగు కాకముందే ఈ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపై ఉందని, ఇందుకోసం ఐక్యఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పాల్గొన్న ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉపాధ్యాయులను వేధించడం తగదని, ప్రభుత్వ వైఫల్యాలను ఉపాధ్యాయుల మీదకు నెట్టడం సమంజసం కాదన్నారు. శ్రీకాకుళంలో పాల్గొన్న ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పేడాడ ప్రభాకరరావు మాట్లాడుతూ విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేయడం, ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలకు స్వస్తి పలకాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే తాత్కాలిక సాయం ప్రకటించాలని కోరారు. విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగిన ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎన్జీవో రాష్ట్ర నాయకులు ఎ.విద్యాసాగర్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం పోరాడకతప్పదన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జరిగే ఉద్యమాలకు ఎన్జీవోల మద్దతు ఉంటుందన్నారు. ఏపీటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు పి.పాండురంగ వరప్రసాదరావు మాట్లాడుతూ 117 జీవో వచ్చి సంవత్సరం కాలం గడిచిందని, జీవో విడుదలైనప్పుడే ఉపాధ్యాయ సంఘాలన్నీ సంఘటితమై ఎదుర్కొని ఉంటే ఈ జీవో అమలయ్యేది కాదన్నారు. జీవో అమలు వల్ల సమీప భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాలలు, ఆ తర్వాత ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ రంగం నుంచి అదృశ్యమయ్యే ప్రమాదం కనపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యూటీిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులను ఇంతగా వేధిస్తున్న ప్రభుత్వాన్ని ఇంతకుముందు ఎన్నడూ చూడలేదన్నారు. దీనికి పాలకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఫ్యాప్టో ఎన్టీఆర్‌ జిల్లా చైర్మన్‌ సయ్యద్‌ ఖాసిం, ఇమామ్‌ బాషా, ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి భిక్షమయ్య, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అరుణ, ఓపీడీఆర్‌. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.హనుమంతరావు, జనసాహితీ రాష్ట్ర అధ్యక్షుడు దివి కుమార్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img