Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

భేటీల పర్వం

నేడు కుప్పం కార్యకర్తలతో జగన్‌
పార్టీ బలోపేతం, అభివృద్ధిపై దిశానిర్దేశం
నియోజకవర్గానికి 40 మంది
2024 ఎన్నికల గెలుపే లక్ష్యం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: వైసీపీ కార్యకర్తలతో భేటీలకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ సిద్ధమయ్యారు. ఈనెల 4వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గ కార్యకర్తలను సీఎం స్వయంగా కలసి, వారి సమస్యల్ని ఆలకించనున్నారు. తొలిరోజు కుప్పం నియోజకవర్గం కేంద్రంగా జగన్‌ భేటీ ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే అధికార వైసీపీ హడావుడి చేస్తోంది. మూడేళ్లపాటు పార్టీపై ఎలాంటి దృష్టి పెట్టకపోవడంతో, సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసనలు, అసంతృప్తులు వెల్లువెత్తాయి. కనీసం జగన్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేలకు సైతం అనుమతులు లేకపోవడంతో వారికి దిక్కుతోచని స్థితి నెలకొంది. నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కాక, అభివృద్ధి పనులకు నిధులు రాక ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. ఇవి మరీ పెరిగిపోవడంతో జగన్‌ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వైసీపీ ప్లీనరీలు నిర్వహించి, అనంతరం విజయవాడగుంటూరు కేంద్రంగా రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో ప్రతినెలా జగన్‌ సదస్సులు నిర్వహిస్తూ, వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. గెలిచే వారికే టికెట్‌ ఉంటుందనే సంకేతం తీసుకెళ్లారు. వార్డు/గ్రామ సచివాలయాలను ప్రతి ఎమ్మెల్యే సందర్శించాలంటూ లక్ష్యం విధించారు. పనితీరు బాగా లేకుంటే, ఇక టికెట్‌లు ఉండవని తేల్చిచెప్పారు. దీంతో ఎమ్మెల్యేల్లో ఒకింత అభద్రతా భావం నెలకొంది. ఇప్పటివరకు రెండు విడతలుగా జరిగిన సదస్సుల్లో రాబోయే 2024 ఎన్నికల్లో 175/175 సీట్లు సాధించాలంటూ జగన్‌ లక్ష్యం విధించారు. ఎవరైనా అభివృద్ధి పనులపైన లక్ష్యం విధిస్తారేగానీ, ఇలా ఎన్నికల్లో విజయంపై జగన్‌ ఆదేశించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం 85శాతం మందికి సంక్షేమ పథకాలు అందజే స్తోందని, వారి దగ్గరకు వెళ్లి ఆయా విషయాలు తెలుసుకోవాలంటూ ఎమ్మెల్యేలను ఆదేశించారు. జగన్‌ విధిస్తున్న లక్ష్యాలపైనా కొంత మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొంది. వాటిని బుజ్జగించేందుకుగాను, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యేకు రూ.2కోట్ల నిధులు కేటాయించారు. అటు సచివాయాల పరిధిలో అభివృద్ధి పనులకు రూ.20లక్షల నిధులు వెచ్చించారు. అంతటితో ఆగకుండా పార్టీ క్రియాశీలక నేతలు, కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తులను తొలగించేందుకుగాను వారితో జగన్‌ భేటీలు ప్రారంభించారు.
వైసీపీలో ఆగని అసంతృప్తి
మంత్రివర్గ విస్తరణ అనంతరం ఇంకా సీనియర్లలో అసంతృప్తి కొనసాగుతోంది. ఏలూరుజిల్లాకు చెందిన ఆళ్ల నానిని మంత్రివర్గం నుంచి తొలగించాక, ఆయన ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాల్లో అంత ఉత్సాహంగా కన్పించడం లేదు. మంత్రివర్గం నుంచి తొలగించడంపై అలక చెందినట్లుగా ప్రచారముంది. ఇదేబాటలో మరికొంతరు సీనియర్లు ఉన్నారు. మంత్రి పదవులు పోయిన వారికి పార్టీలో జిల్లా అధ్యక్ష పదవులు, ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల్ని అప్పగించినప్పటికీ, వారు పూర్తి స్థాయిలో ముందుకెళ్లడం లేదు. వైసీపీలో కింది నుంచి పై స్థాయి వరకు ఉన్న అసంతృప్తిని తొలగించడం, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం వెరసి జగన్‌ భేటీలు సిద్ధమయ్యారు.
కుప్పం నుంచి ఆరంభం
ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి జగన్‌ భేటీలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 4వ తేదీ, కుప్పం నియోజకవర్గం కార్యకర్తలతో జగన్‌ భేటీ అవుతారు. పార్టీ కోసం, ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న దాదాపు 40 మంది వైసీపీ ముఖ్య కార్యకర్తలను నేరుగా ఆయన కలిసి వారి సమస్యలపై ఆరా తీస్తారు. స్థానిక, నియోజకవర్గ పరిస్థితుల్ని అడిగి తెలుసుకుంటారు. రోజూ మధ్యాహ్నం సమయంలో ఈ భేటీ జరగనుంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, పురోగతి, బలోపేతం, అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రత్యర్థుల నోళ్లను ఎలా మూయించాలి, తదితర విషయాలపై సీఎం జగన్‌ నేరుగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img