Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

‘గడప’ గండం

జగన్‌ నిఘా నేత్రం` పనితీరే కొలబద్ద
మితిమీరిన లక్ష్యాలతో అసంతృప్తులు
2024 టికెట్లపై నేతల్లో కలవరం
గెలుపే లక్ష్యంపై సర్వత్రా విమర్శలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: వైసీపీ ప్రజాప్రతినిధులకు గడపగడపకూ గండం వెంటాడుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్‌ నిర్దేశించిన లక్ష్యాలు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా ఉన్నాయి. జగన్‌ అధ్యక్షతన జరిగిన ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం విభిన్న విమర్శలకు దారితీస్తోంది. గత నెల నుంచి ప్రాంతీయ, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో జగన్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధినేత లక్ష్యాలు, మితిమీరిన దిశానిర్దేశాలతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో అసమ్మతి పెరుగుతోంది. ఇప్పటికే రెండో విడతలో మంత్రి పదవి ఆశించి కొందరు భంగపాటుకు గురవ్వగా, మరికొందరిని తిరిగి కొనసాగించకపోవడంతో అలక వహించారు. వారంతా పార్టీ అధిష్ఠానంతో అంటీఅంటనట్టు వ్యవహరిస్తున్నారు. జగన్‌ నిర్వహిస్తున్న గడపగడపకూ మన ప్రభుత్వం సదస్సుకు మాత్రం బుద్ధిగా హాజరవుతున్నారు. రెండు సదస్సుల లక్ష్యం చూస్తే, రాబోయే ఎన్నికల్లో 175/175 సీట్లు గెలుపే లక్ష్యంగా జగన్‌ విధానం కనిపిస్తోంది. పూర్తిగా సంక్షేమంపైనే దృష్టిపెట్టి, అభివృద్ధిని విస్మరించేలా ఉందని ప్రతిపక్షాలూ విమర్శిస్తున్నాయి. రాష్ట్రాభివృద్ధిపైన, నియోజకవర్గాల అభివృద్ధిపైన సమగ్రమైన విధానంతో ముందుకెళ్లడం లేదు. మూడేళ్ల తర్వాత ఎమ్మెల్యేలకు రూ.2కోట్లు చొప్పున కేటాంచారు. అప్పటివరకు వారికి నిధులు, అధికారాలు లేవు. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థతో ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య పూర్తి సంబంధాలు తెగిపోయాయి. అంతా సచివాలయ వ్యవస్థతోనే సంక్షేమం కొనసాగుతోంది. దీనిపైనా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. తామంతా అలంకార ప్రాయంగా ఉన్నామని వాపోతున్నారు.
ఎమ్మెల్యేలపై పరిశీలకులు
గడపగడపకూ కార్యక్రమం విజయవంతంపై 175 నియోజకవర్గాల్లో పరిశీలకులను నియమించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎమ్మెల్యేల పనితీరుపై వారంతా పర్యవేక్షిస్తారు. దీనిపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. గత సదస్సు కంటే, రెండోసారి జరిగిన సదస్సులో జగన్‌ లక్ష్యం పెంచడం ఎమ్మెల్యేలకు మింగుడుపడటం లేదు. గడప, గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో ఏడు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలని, ఆగస్టులో కనీసంగా 16 రోజులు, గరిష్టంగా 21రోజులపాటు పాల్గొనాలంటూ ఆదేశించడంపై గుర్రుగా ఉన్నారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపైనే అధినేత ఇలా నిఘా నేత్రంలో వ్యవహించడంపై ఎమ్మెల్యేలు విస్తుపోతున్నారు. ఇప్పటికే వారికి మూడేళ్ల నుంచి వ్యక్తిగతంగా సీఎం ప్రవేశాలు లేవు. నియోజకవర్గ సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. ఆయా ఎమ్మెల్యేలు పోటీ చేసే సమయంలో, స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి, వాటి అమలుకు కృషి చేస్తామని ప్రకటించారు. అవి ఎక్కడా ముందుకు పోవడం లేదు. జిల్లాల విభజనతో పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. సొంత పార్టీ నేతలు అభివృద్ధిని విస్మరించి, ఎవరికి వారే స్వప్రయోజనాలపై దృష్టి కేంద్రీకరించారనే విమర్శలున్నాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మంత్రి, జిల్లాకు చెందిన మంత్రులు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడిరది. చాలా నియోజకవర్గాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి సమష్టిగా తిరగడం లేదు. సీఎం ఆదేశాల మేరకు మొక్కుబడిగా ఎమ్మెల్యేలు హాజరువుతున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఇంతవరకు బయటకు రాకపోవడం చర్చానీయాంశంగా మారింది. గ్రామ/వార్డు సచివాలయాల ఆధారంగానే నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనులకు రూ.20 లక్షలు కేటాయించింది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఒక్క అంశంలోనూ జగన్‌ ముందుకెళ్లలేదు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిలిచిపోయాయి.
ఓట్ల కోసమే సంక్షేమమా?
జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధిపైనా ప్రశ్నిస్తున్నాయి. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల అమలులో జగన్‌ పూర్తిగా విఫలమయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిచ్చే విషయంలో కేంద్రంపై జగన్‌ ఒత్తిడి చేసే అవకాశం వచ్చినప్పటికీ, మౌనంగా ఉండిపోవడం విమర్శలకు దారితీస్తున్నాయి. నిత్యం కేంద్రం అనుమతితో అప్పులుచేసి, రాష్ట్రాన్ని అధోగతి పాల్జేయడంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. రెండో విడత జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం సదస్సులో, 87శాతం కుటుంబాలకు పథకాలు అందించామని, వారి మద్దతు తీసుకుంటే 175/175 స్థానాలో ఎందుకు గెలవలేవమంటూ జగన్‌ ప్రశ్నించారు. దీని ఆధారంగా సంక్షేమం పొందిన వారందర్నీ, రాబోయే ఎన్నికలకు ఎమ్మెల్యేలు ఓట్లు వేసుకునేలా సిద్ధపడాలనేదీ జగన్‌ సందేశం. అటు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుకునే జగన్‌ ప్రభుత్వం, ఈ తరహాగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడంపైనా విమర్శలున్నాయి.
పేరుకు కలసి కష్టపడుదామంటూ జగన్‌ సందేశమిస్తూనే, పనితీరు సరిగ్గా లేకపోయిన వారికి రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఉండబోవంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలకు 2024 ఎన్నికల్లో తమకు టికెట్లు వస్తాయా? లేకపోతే రాజకీయ భవిష్యత్‌ ఏమిటనేదీ అంతుచిక్కడం లేదు. జగన్‌ ఏకపక్ష వైఖరి విడనాడి సంక్షేమంతోపాటు రాష్ట్రాభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img