భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇది 30.5 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు జలాశయానికి వరద పోటెత్తింది. శనివారం ఉదయం ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి 66 వేల 900 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతోంది. అధికారులు 5 గేట్లను ఎత్తారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 70 వేలు, ఔట్ ఫ్లో 32,267 క్యూసెక్కులుగా ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 18,275 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, 1066 అడుగులకు చేరుకుంది. భారీ వర్షాలతో తెలంగాణలోని చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి.