మోదీది రాజకీయ ప్రసంగం
ఎర్రకోట నుంచి ఎన్నికల ప్రచారం
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
సాలెం: రాజ్యాంగం ప్రకారం నడుచుకోని వ్యక్తి గవర్నర్‌గా అనర్హుడని, తమిళనాడు గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవిని తొలగించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వానికి అనుకూలంగా గవర్నర్ పనిచేస్తారని తమిళ ప్రజలకు తెలుసునన్నారు. రాజా బుధవారం తమిళనాడులోని సాలెంలో పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో మాట్లాడుతూ గవర్నర్ రవి తీరును దుయ్యబట్టారు. నీట్ వ్యతిరేక బిల్లుపై ఆయన వ్యాఖ్యలను ఖండిరచారు. ‘ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించి రాష్ట్రపతికి పంపడమే గవర్నర్ చేయాల్సినది. ఆ బిల్లుపై నిర్ణయించే అధికారం ఆయనకు ఉండదు’ అని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారేగానీ గవర్నర్ కాదన్నారు. కేంద్రానికి తొత్తుగా ఉండే గవర్నర్ తమిళనాడు ప్రజలకు అక్కర్లేదని, ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని రాజా అన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ ఎర్రకోట మీద నుంచి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని దుయ్యబట్టారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా రాజకీయ ప్రసంగాన్ని ప్రధాని చేశారని రాజా విమర్శించారు.
ప్రతిపక్షాలపై విమర్శలకు, ఎన్నికల ప్రచారానికి ఎర్రకోటను వేదికగా మల్చుకున్నారన్నారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశం ఎంతటి అస్థిర పరిస్థితుల్లో ఉన్నది ప్రజలకు తెలుసునన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో మహిళలపై చెప్పలేనంత హేయమైన నేరాలు జరిగితే మొసలికన్నీరు కార్చారని మోదీని దుయ్యబట్టారు. ఆ రాష్ట్రానికి వెళ్లాలని ప్రధానిని రాజా డిమాండ్ చేశారు. మణిపూర్ ప్రజలను విభజించి రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోందన్నారు. ‘మణిపూర్ ప్రజల్లో ఐక్యత, సఖ్యతను ఆకాంక్షిస్తున్నాం, ఇందుకు మా వంతు కృషిచేసున్నాం’ అని రాజా అన్నారు.