గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటలుగా పడుతున్న వానలకు రహదారులన్నీ జలమయం అయ్యాయి. పలు ఆఫీసులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. గడచిన కొన్ని గంటల్లోనే దాదాపు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు వరద ముప్పుకు గురయ్యాయి. రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వీధుల్లో నిలిచిన వరద నీటి కారణంగా ఇల్లు, కార్లు, దుఖాణాలు నీళ్లతో నిండిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న గిర్ సోమనాథ్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి కేవలం 14 గంటల్లో 345 మి.మీ వర్షం కురిసింది. రాజ్‌కోట్ జిల్లాలోని కేవలం రెండు గంటల్లోనే 145 మి.మీ. వర్షపాతం నమోదైంది. అటు సూరత్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జునాగఢ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ నీటి ప్రవాహం కారణంగా గుజరాత్‌లోని 206 రిజర్వాయర్‌లలో 43 హైఅలర్ట్, 18 అలర్ట్ మోడ్‌లో ఉన్నాయి. మరో 19 రిజర్వాయర్లకు గుజరాత్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం , రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు హై అలర్ట్ ప్రకటించాయి.