Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రభుత్వ ఆర్థిక విధానాలపై గురువుల ఆందోళన

ఖజానా కార్యాలయాల ఎదుట నిరసనలు
అన్నమయ్య జిల్లాలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హాజరు
భీమవరం, కర్నూలులో ఎస్టీయూ నేతలు సాయిశ్రీనివాస్‌, తిమ్మన్న నిరసన
13 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు నష్టమని ఆందోళన
ఎస్టీయూ పిలుపు విజయవంతం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల్ని నిరసిస్తూ, అన్ని జిల్లా ఖజానా కార్యాలయాల ఎదుట రాష్ట్రోపాధ్యాయ సంఘంఆంధ్రప్రదేశ్‌ (ఎస్టీయూ`ఏపీ) బుధవారం నిరసనలు చేపట్టింది. ఎస్టీయూ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల ఖజానా కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, భీమవరంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.సాయిశ్రీనివాస్‌, కర్నూలులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌.తిమ్మన్న హాజరయి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఎండగట్టారు. ఈ సందర్భంగా సాయిశ్రీనివాస్‌, తిమ్మన్న మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో 13 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఆర్థికంగా అభద్రత భావానికి గురై ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ, వారికి రావాల్సిన ప్రయోజనాల చెల్లింపులో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందన్నారు. ప్రావిడెంట్‌ ఫండ్‌, ఏపీజీఎల్‌ఐ తుది చెల్లింపులు, సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లింపులు తీవ్రంగా జాప్యమయ్యాయని తెలిపారు. దీనివల్ల పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, వారి పిల్లల వివాహాలు వాయిదా వేసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని వివరించారు. దీంతో ఉపాధ్యాయులు ఆర్థిక అవసరాలు తీరక చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు, కరవు భత్యం చెల్లింపులోనూ జాప్యం నెలకొంద న్నారు. వాటిని జులై చివరకు పరిష్కరిస్తామని మంత్రి వర్గం, సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సభ్య సంఘాలతో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చిన ప్పటికీ, ఇంతవరకూ నెరవేర్చలేదన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని, లేకుంటే, కాంప్రెహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎఫ్‌ఎంఎస్‌) రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీపీఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, 11వ పీఆర్సీ పెండిరగ్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల విలీన ప్రక్రియను నిలుపుదల చేసి 117 ,128 జీవోలను రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆయా జిల్లాల ఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు నిరసనల ప్రదర్శనలకు నాయకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img