భీమిలి తీరంలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్దంగా నేహారెడ్డి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీవీఎంసీ అధికారులు
జనసేన నేత మూర్తి యాదవ్, కూటమి నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో చర్యలు చేపట్టిన అధికారులు
సాయంత్రం వరకూ కొనసాగనున్న ఆక్రమ నిర్మాణాల తొలగింపు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ అధికారులు షాకిచ్చారు. భీమిలి తీరంలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్దంగా నేహారెడ్డి నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. భీమిలి జోన్ పట్టణ సహాయ ప్రణాళిక అధికారి బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం నుండి బీచ్ ఒడ్డున హోటల్ నిర్మాణం కోసం వేసిన కాంక్రీట్ పిల్లర్స్, గోడలు ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు. కూల్చివేతల నేపథ్యంలో భీమిలి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కూల్చివేతలను ఎవరూ అడ్డుకోకపోవడంతో సజావుగా జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కడి అక్రమ నిర్మాణాలు కూల్చివేత పనులు ఈ సాయంత్రం వరకూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక్కడి అక్రమ నిర్మాణాలపై జనసేన నేత మూర్తి యాదవ్, మరి కొందరు కూటమి నేతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేహారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే సింగిల్ జడ్జి ధర్మాసనం ..ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. మరోపక్క అక్రమ నిర్మాణాలను తొలగించడం లేదంటూ ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ను పిటిషనర్లు ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంలో కోర్టు స్టే లేనప్పుడు అధికారులు అక్రమ నిర్మాణాలను నిబంధనల ప్రకారం తొలగించవద్దని హైకోర్టు తెలిపింది. దీంతో అధికారులు ఈరోజు అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు.