ఆరెంజ్ అలెర్ట్ జారీచేసిన ఐఎండీ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిరది. ఆదివారం నుంచే రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు నెలలుగా వేసవిని మరిపిస్తున్న ఎండలు, ఉక్కపోత నుంచి ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో వర్షపాతం నమోదైంది. తాజాగా భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఈ నెల 5, 6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ నెల 6న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. రాబోయే రెండ్రోజుల్లో 11.56 సెంమీ నుంచి 20.44 సెంమీ వరకు రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. పుట్లూరు, కడవకల్లు, శనిగలగూడూరు, తక్కళ్లపల్లి, గండ్లపాడు, ఎస్. తిమ్మాపురం గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఎస్.తిమ్మాపురం గ్రామ శివారులోని వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ఆ గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకొంది. గ్రామ శివారులోని పంట పొలాలు నీట మునిగాయి. ఎస్.తిమ్మాపురం-తక్కళ్లపల్లి కి వెళ్లే రహదారిలో కల్వర్టు కుంగిపోవడంతో రాకపోకలు నిలిచాయి. గాండ్లపాడు వద్ద తాడిపత్రి – సింహాద్రిపురం రహదారిపై వర్షపునీరు భారీగా పొంగిపొర్లుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిలకు వరద నీరు వచ్చి చేరుతోంది.