ఏపీలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ పట్టణ పరిధిలోని పలు కాలనీలు నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే, బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ ముంపు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో ప్రజల ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చిచేరింది. మరోవైపు రోడ్లు కూడా చాలా వరకు కొట్టుకుపోయాయి. రహదారులు మొత్తం బురద మయం అయ్యాయి.దీంతో సీఎం చంద్రబాబు, రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉండి సహాయక చర్యలు, బుడమేరు కాలువ గండ్లకు మరమ్మతు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. విజయవాడలో మంగళవారం సాయంత్రంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అక్కడి ప్రాంతాల్లో తిరుతుతూ సమీక్షలు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఆ ప్రాంత అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలకు చెందిన 2.75 లక్షల మందికి సహాయక చర్యలు అందించాలని సూచించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు.