Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అయ్యా… ఆకలి!

మెనూలో కోత…

అర్థాకలితో వసతిగృహ విద్యార్థులు
అధికారుల ప్రతిపాదనలు బుట్టదాఖలు
డ్జెట్‌లో నిధులు పెంచని ప్రభుత్వం
అష్టకష్టాలతో నెట్టుకొస్తున్న నిర్వాహకులు

విశాలాంధ్ర – పాడేరు: నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నా, బడ్జెట్‌లో ప్రభుత్వం వసతి గృహాల విద్యార్థుల మెనూ ఛార్జీలు పెంచడం లేదు. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా కాకుండా ఐదేళ్ల కిందట ఉన్న రేట్లతోనే నిధులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులను అర్ధాకలితోనే నిద్రపుచ్చు తోంది. ప్రస్తుత మార్కెట్‌ ధరలకు అనుగుణంగా వసతి గృహాల నిర్వహణకు మెస్‌ చార్జీలు పెంచాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.అధికారులు ప్రతిపాదనలు చేస్తున్నా బడ్జెట్‌ కేటాయింపు బుట్ట దాఖలైన పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. పూర్తిస్థాయిలో న్యాయం చేయలేక నిర్వాహకులు మెనూలో కోతలు పెడుతున్నారు.
అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని 122 ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాలు, 49 పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలలో సుమారు 50వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పూర్తిస్థాయి మెనూ అమలుచేయకపోవడంతో ఆయా వసతి గృహాల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. మెనూ ప్రకారం నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందడంతో నిర్వాహకులు మెనూ అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజం నేతిబీరకాయ చందంగా ఉంది.
నిత్యావసర సరుకుల ధరలు మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయాయి. దీనికితోడు చమురు ధరలు పెరిగాయి. గతంలో గ్యాస్‌ సిలిండర్‌ రూ. 781… ప్రస్తుతం రూ .1094లుగా ఉంది. గతంలో కిలో కందిపప్పు రూ. 52 ఉండగా, నేడు రూ.110 ఉంది. ఈ స్థాయికి తగ్గట్టు వసతి గృహాల బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరగడం లేదు. దీంతో వసతి గృహాల నిర్వహణ కష్టతరంగా మారడంతో మెనులో కోతలు విధిస్తున్నారు.
వసతి గృహాల్లో 3 నుంచి 6వ తరగతి వరకు రూ.1050, 7 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థికి ప్రభుత్వం మెస్‌ చార్జీల కింద నెలకు రూ. 1250, కళాశాలల విద్యార్థులకు నెలకు రూ. 1400 చెల్లిస్తుంది. గతంలో కళాశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం రెండు పూటల భోజనం, వారంలో రెండు రోజులు కోడి కూర, ప్రతిదినం పాలు, పండు సాయంత్రం స్నాక్స్‌ అందించేవారు. ప్రస్తుతం మెనూలో కోతలు పెడుతున్నారు. రోజుకు రూ.46.66 తో ఉదయం అల్పాహారం రెండు పూటల భోజనం, వారంలో ఒకరోజు కోడికూర, మూడు రోజుల గుడ్లు, ప్రతి దినం పాలు పండు సాయంత్రం స్నాక్స్‌ పెట్టాలి. ఆశ్రమ విద్యార్థులకు రోజుకు రూ 41. 66 చెల్లిస్తుంది. ధరలు పెరగడంతో మెనూ కోతలు పెడుతూ నిర్వాహకులు నెట్టుకొస్తున్నారు. ప్రస్తుత ధరల కనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచి, బడ్జెట్లో నిధులు పెంచి, మెనూ పక్కాగా అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img