Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇంకెన్నాళ్లు ?

ఎనిమిదేళ్లయినా విభజన హామీలు అమలు కాలేదు

. రెవెన్యూ లోటు భర్తీ చేయండి
. కేంద్ర సంస్థల నిర్మాణాలకు నిధులివ్వండి
. పోలవరం బకాయిలు ఎప్పుడిస్తారు?
. దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో మంత్రి బుగ్గన

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిది సంవత్సరాలు దాటినా ఇంతవరకు చాలా హామీలను కేంద్ర ప్రభత్వం అమలు చేయలేదని, ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారం కాలేదని, వాటిని తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కోరారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌ కేరళ రాజధాని తిరువనంతపురంలో శనివారం సమావేశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. విభజన సమస్యలను మంత్రులు ప్రస్తావించారు. గత నెల 29వ తేదీన దీనికి సంబంధించి సీఎం జగన్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి, దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఏం మాట్లాడాలో మంత్రులకు మార్గనిర్దేశనం చేశారు. ఆ మేరకు మంత్రి బుగ్గన ఈ సమావేశంలో అన్ని సమస్యలను ప్రస్తావించారు. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్‌ లాంటి మహానగరాన్ని వదులుకోవడంతో ఆదాయం కోల్పోయామని తెలిపారు. రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాల్సి ఉందని గుర్తు చేశారు. విద్య, వైద్య సంస్థల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాలని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఏపీకి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు బాధితుల పునరావాసానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. రామాయపట్నం పోర్టు, భోగాపురం విమానాశ్రయం గురించి ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల మధ్య గల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. విభజన అంశాలు, తెలుగు రాష్ట్రాల మధ్య పెండిరగ్‌ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలు సూచించడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల మండలి తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేదిగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విభజన సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతున్న కొద్దీ ఏపీకి మరింత ఎక్కువ ఆర్థిక నష్టం జరుగుతోందని వివరించారు. విభజన అంశాల అమల్లో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, ఇకనైనా సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశానికి తెలంగాణ తరపున ఆ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ ఆలీ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరు ఏపీ, తెలంగాణ మధ్య పేరుకున్న విద్యుత్‌ బకాయిలు, 9,10 షెడ్యూళ్లకు సంబంధించిన విభజన సమస్యలు, కృష్ణా జలాల పంపిణీ, నీటిపారుదలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img