Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం.. ఏడుగురు మృతి!

  • సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం
  • ఏడుగురు మృతి
  • పది మందికి గాయాలు
  • షోరూంపైన రూబీ హోటల్‌కూ మంటలు
  • ఆ సమయంలో లాడ్జిలో పలువురి బస
  • కాలిన గాయాలతో కిందకు దూకిన పలువురు
  • 8 వాహనాలతో రంగంలోకి అగ్నిమాపక శాఖ
  • ప్రాణాలకు తెగించి, పలువురిని కాపాడిన సిబ్బంది

సికింద్రాబాద్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో.. ఆ ప్రాంతంలో భారీ శబ్దాలు వచ్చాయి.  పైన ఉన్న రూబీ హోటల్‌కు మంటలు వ్యాపించాయి. లాడ్జీలోని ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడున్న ఓ ఎలక్ట్రిక్ వాహన షోరూంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆపై అవి దానిపైన ఉన్న లాడ్జిలోకి వ్యాపించాయి. పొగ దట్టంగా వ్యాపించడంతో లాడ్జీలోని పర్యాటకులు ఊపిరాడక ఎక్కడికక్కడ స్పృహతప్పి పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. వీరి వయసు 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో విజయవాడకు చెందిన ఎ.హరీశ్, చెన్నైకి చెందిన సీతారామన్, ఢిల్లీకి చెందిన వీతేంద్ర ఉన్నట్టు గుర్తించారు. మిగిలిని వారిని గుర్తించే పనిలో ఉన్నారు.

సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయ సమీపంలో ఓ ఐదంతస్తుల భవనం ఉంది. ఇందులోని నాలుగు అంతస్తుల్లో రూబీ లగ్జరీ ప్రైడ్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్, సెల్లార్‌లో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూముును నిర్వహిస్తున్నారు. గత రాత్రి 9.40 గంటల సమయంలో గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనాల్లోని బ్యాటరీలో ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయి. దీంతో వాహనాలు అంటుకుని మంటలు భయానకంగా ఎగసిపడ్డాయి. ఆపై పై అంతస్తులకు వ్యాపించాయి. దీనికి తోడు దట్టమైన పొగలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు, మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గంలేని పర్యాటకలు భయంతో హాహాకారాలు చేశారు. రక్షించమని కేకలు వేశారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది. తప్పించుకునే మార్గం కనిపించకుండా పోయింది. ఇంకోవైపు పొగ దట్టంగా కమ్మేయడంతో ఊపరి ఆడక పర్యాటకులు సృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో ఏడుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 

మంటలు అంటుకుని నలుగురు చనిపోయారు. కిందికి దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హోటల్ గదుల్లో చిక్కుకున్న వారిని హైడ్రాలిక్ క్రేన్ సాయంతో రక్షించారు. క్షతగాత్రులను సికింద్రాబాద్‌లో గాంధీ, యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాపించే అవకాశం ఉండడంతో వాటిని ఖాళీ చేయించారు.

సమాచారం అందుకున్న వెంటనే మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న తదితరులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మంటలార్పేందుకు ప్రయత్నించినా..

షోరూం గోదాములో మంటలంటుకోగానే.. స్థానికులు షోరూంలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాంతో వారు షోరూంలో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే.. కాసేపటికే వారి పరికరాల్లో మంటలను ఆర్పే వాయువు అయిపోవడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే బ్యాటరీలు పేలిపోతూ.. మంటలు వేగంగా వ్యాప్తిచెందాయి.

ఏసీ గదులతో మంటల వ్యాప్తి

లాడ్జిలోని గదుల్లో దిగిన వారు ఏసీలు వేసుకోవడం కూడా మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమై ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నాలుగంతస్తుల హోటల్‌ల్లో మొత్తం 23 గదులు ఉన్నాయని, రాత్రి 12 గంటలకల్లా.. అన్ని గదులను పరిశీలించామని పేర్కొన్నారు. ఐదు మృతదేహాలను వెలికి తీశామని, పలువురు కిందికి దూకగా.. పైన చిక్కుకున్న 10 మందిని కాపాడామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img