అమెరికాలో హరికేన్ హెలెనా విధ్వంసం సృష్టిస్తోంది.. పెనుగాలులకు ఫ్లోరిడా రాష్ట్రం చిగురుటాకుల వణికింది. ఎటుచూసినా విరిగిపడిన చెట్లు, కుప్పకూలిన ఇళ్లు, వరద నీటితో పరిస్థితి భయానకంగా ఉందని బాధితులు వాపోతున్నారు. కుండపోత వర్షాలకు నాలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ఇళ్లు, ఆఫీసులు, ఆసుపత్రులు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా లేక చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. ఫ్లోరిడాతో పాటు జార్జియా, నార్త్, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో హెలెనా ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. వర్జీనియా రాష్ట్రంలోనూ హెలెనా బీభత్సం సృష్టిస్తోంది. జార్జియాలోని ఓ ఆసుపత్రి నీట మునగడంతో పేషెంట్లు, సిబ్బంది బంగ్లా పైకెక్కి సాయం కోసం కేకలు పెట్టారు. బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు హెలికాఫ్టర్ సాయంతో మొత్తం 54 మందిని కాపాడారు. నాలుగు రాష్ట్రాల్లో హెలెనా సృష్టించిన విధ్వంసానికి ఇప్పటి వరకు 45 మంది చనిపోయారు. రెస్క్యూ పనుల్లో నిమగ్నమైన ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది ముగ్గురు కూడా చనిపోయారు. టెనెస్సీ లో 7 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఫ్లోరిడాలో హరికేన్ తీరం దాటే సమయంలో పెనుగాలులు వీచాయి. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో తీర ప్రాంతంలోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. నాలుగు రోజుల క్రితం ఇళ్లు ఉన్నచోట ప్రస్తుతం శిథిలాల కుప్పలు కనిపిస్తున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు హెలెనా హరికేన్ ను కేటగిరి 4 గా ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో సుమారు 25 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. అట్లాంటాలో 1886 లో 24.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. హెలెనా ప్రభావంతో 48 గంటల్లో 28.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు.
నార్త్ కరోలినాలో వరదల్లో చిక్కుకున్న వంద మందిని రెస్క్యూ టీమ్ లు కాపాడాయి. వరదల్లో ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలతో పాటు ఇంట్లోని వస్తువులు కూడా కొట్టుకుపోయాయి. పలుచోట్ల గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోతుండడం చూశామని వరద బాధితులు చెప్పారు. తలహస్సీలోని ఓ స్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 175 మంది ఆశ్రయం పొందుతున్నారు. హరికేన్ కారణంగా స్కూళ్లు, ఆఫీసులు, యూనివర్సిటీలు మూతపడ్డాయి.
కాగా, హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడంతో పాటు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివరించారు. హెలెనా హరికేన్ ను అంతరిక్ష కేంద్రం నుంచి చిత్రించిన వీడియోను నాసా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.