భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం వున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్ట్ 29న కొన్ని పత్రికలు రాసిన కథనాలు… గౌరవనీయ న్యాయస్థానం యొక్క న్యాయపరమైన విజ్ఞతను తాను ప్రశ్నిస్తున్నాననే అభిప్రాయం తనపై కలిగేలా చేసిందనే విషయాన్ని అర్థం చేసుకోగలనని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. న్యాయ వ్యవస్థను తాను ఎంతో విశ్వసిస్తాననే విషయాన్ని మరోసారి గట్టిగా చెపుతున్నానని రేవంత్ అన్నారు. మీడియాలో వచ్చిన కథనాల పట్ల తాను బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. తనకు సంబంధం లేని వ్యాఖ్యలను తనకు ఆపాదించారని విమర్శించారు. న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని దృఢంగా విశ్వసించే వ్యక్తిగా… న్యాయ వ్యవస్థను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని తెలిపారు.