Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

అద్భుత పథకాలు అమలు

నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం జగన్‌ స్వోత్కర్ష
ఏపీలో 62 శాతం జనాభా వ్యవసాయ ఆధారమే
అందుకే దానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం
విద్యారంగంలో అనేక సంస్కరణలు
సూచనలు, సమస్యలు ప్రస్తావించని వైనం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : దేశ రాజధానిలో ఆదివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సీఎం జగన్‌ విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు ప్రస్తావించడం, మరోవైపు నీతి ఆయోగ్‌ సమావేశ లక్ష్యానికి అనుగుణంగా అవసరమైన విలువైన సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి ఒక మంచి అవకాశాన్ని జారవిడిచారని ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీ నేతలు సైతం విమర్శిస్తున్నారు. ఫలితం గురించి విశ్లేషించకుండా, కొత్త పథకం అమలు చేయడమే గొప్ప అన్న విధంగా సీఎం తాను విద్యా, వ్యవసాయ రంగాల్లో అమలు చేస్తున్న పథకాలను వివరించి రాష్ట్ర ప్రజలను నిరుత్సాహపరిచారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్క సమస్యనూ ఆయన ప్రస్తావించలేకపోయారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పు పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాల్లో ఆత్మ నిర్భర్‌ సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారంపై ఈ సమావేశంలో చర్చించగా, ఏపీలో అమలు చేస్తున్న పథకాల గురించి జగన్‌ వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యిందని, 62 శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారని, జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35 శాతం పై మాటేనని జగన్‌ తెలిపారు. వ్యవసాయ రంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తాము ఆ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా`పీఎం కిసాన్‌, ఉచిత పంటల బీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటలపాటు ఉచితంగా కరెంటు తదితర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా రైతులకు మరింత అండగా నిలవడానికి వారికి భరోసానిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ అవసరాలకు ఒన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కింద ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నాణ్యమైన, ధ్రువీకరించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. డిజిటల్‌ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎం యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజువారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్‌ ద్వారా నిరంతరం పరిశీలన, పర్యవేక్షణ చేస్తున్నాం. అవసరమైన పక్షంలో ప్రభుత్వం తరపున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నాం. దీంతోపాటు ఆర్బీకే స్థాయిలోనే ఇ-క్రాప్‌ బుకింగ్‌ కూడా చేస్తున్నాం. ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి ఇ-క్రాప్‌ బుకింగ్‌ దోహదపడుతోందని వివరించారు. ఆర్బీకేల్లో కియోస్క్‌లను కూడా అందుబాటులో పెట్టామని ఆయన తెలిపారు. రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని కియోస్క్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయవచ్చు. వారి చెంతకే అవన్నీ కూడా చేరవేస్తున్నాం. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి, సూచనలు చేయడానికి శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఆర్బీకేల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను కూడా ప్రారంభిస్తున్నాం. పంటల మార్పిడి, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, క్రమంగా సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులవైపుగా రైతులను ప్రోత్సహిస్తున్నామని సీఎం వివరించారు.
విద్యారంగంలో సంస్కరణలు
ఇక విద్యా రంగం విషయానికొస్తే బడికెళ్లడం, చదువుకోవడం అన్నది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, దీనిని సుస్థిర ప్రగతి లక్ష్యాలతో అనుసంధానం చేశామని స్కూళ్లు మానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతోపాటు జీఈఆర్‌ నిష్పత్తిని పెంచేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్‌ నిష్పత్తి 99.21 శాతంకాగా, ఏపీలో ఇది 84.48 కావడం విచారకరం. 2018లో కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల్లో విద్యారంగంలో రాష్ట్రం పనితీరు అత్యంత దారుణంగా ఉందని వెల్లడయింది. అందుకే విద్యారంగంలో కీలక అంశాలపై దృష్టిపెడుతూ సమర్థవంతమైన విధానాలను తీసుకువచ్చాం. తల్లిదండ్రుల పేదరికం అన్నది పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమ్మఒడి అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏటా రూ.15 వేల చొప్పున పిల్లల తల్లులకు అందిస్తున్నాం. విద్యాకానుక ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌, నోట్‌ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లీషు టు తెలుగు డిక్షనరీలు ఇస్తున్నాం. పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్‌ యాప్‌ కూడా అందిస్తున్నాం. 8వ తరగతి విదార్థులకు ట్యాబ్‌ కూడా ఇవ్వబోతున్నాం. ఇక నాడు- నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేలా పిల్లలను తీర్చిదిద్దడానికి అన్ని స్కూళ్లను మ్యాపింగ్‌ చేసి సబ్జెక్టు వారీగా టీచర్లను 3వ తరగతి నుంచే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. విద్యాదీవెన పథకం ద్వారా 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని అన్నారు. పౌరుల గడపవద్దకే సేవలందించే విధానాన్ని అమలు చేస్తూ.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఇప్పుడు రాష్ట్రంలో పని చేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి కల్పించడంతో పాటు అవినీతి లేకుండా, పారదర్శకంగా ప్రజలకు సేవలందించగలుగుతున్నామని సీఎం జగన్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img