బ్రిటన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆయన సహాయకుడు సయీద్ జుల్ఫీ బుఖారీతో పాటు పాక్ పత్రిక డాన్ ధ్రువీకరించింది.ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఛాన్సలర్ పదవి కోసం శతాబ్దాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు, ఉద్యోగులు ఈ పదవికి పోటీ చేయడానికి అర్హులు. తాజాగా ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి మార్పులు చేశారు. నామినేషన్, ఓటింగ్ అన్ లైన్ లో జరిగే వెసులుబాటు కల్పించారు. ఇమ్రాన్ ఖాన్ 1970లో ఆక్స్ ఫర్డ్ లో ఎకనామిక్స్ లో పట్టా అందుకున్నారు. గతంలో బ్రాడ్ ఫోర్డ్ యూనివర్శిటీకి ఎనిమిదేళ్ల పాటు ఇమ్రాన్ ఖాన్ ఛాన్సలర్ గా పని చేశారు. నిన్నటితో ఆక్స్ ఫర్డ్ లో నామినేషన్ల గడువు ముగిసింది. అక్టోబర్ 28న ఆన్ లైన్ లో ఓటింగ్ జరుగుతుంది. బ్రిటన్ లోని శక్తిమంతమైన రాజకీయ నాయకులు కూడా ఈ పదవికి పోటీ పడిన వారిలో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని ఆడియా జైల్లో ఉన్నారు. తోషఖానా, సైఫర్, ముస్లిం వ్యతిరేక వివాహం తదితర కేసుల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన భార్య బుర్షా బీబీ కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ పై 200కి పైగా కేసులు నమోదు చేశారు.