లోకేశ్‌కు దిల్లీలో నోటీసులు అందజేసిన సీఐడీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబరు 4న ఉదయం 10గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41ఏ కింద నోటీసు జారీ చేశారు. లోకేశ్ ప్రస్తుతం దిల్లీలోని అశోకారోడ్‌లో ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్నారు. దీంతో సీఐడీ అధికారులు శనివారం దిల్లీలోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి లోకేశ్‌కు నోటీసులు అందజేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్ వ్యవహారంపై గత ఏడాది నమోదుచేసిన కేసులో ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగ్గా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని, దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని ఏజీ కోర్టుకు తెలియజేశారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు లోకేశ్‌కు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. తొలుత లోకేశ్‌కు వాట్సాప్ ద్వారా నోటీసు పంపారు. అది తనకు అందినట్లు లోకేశ్ సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ, దిల్లీ వెళ్లి మరీ వ్యక్తిగతంగా నోటీసును అందజేశారు.