నీట్ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ ప్రారంభించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ జరిగిందనేది వాస్తవమేనని, అయితే, లీక్ అయిన పేపర్ దేశమంతటా సర్క్యులేట్ అయిందనేందుకు ఆధారాలు లేవని అన్నారు. బీహార్ కేంద్రంగా పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. లీకేజీకి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించాలని గత విచారణలో ఆదేశించారు. ఇప్పటి వరకు సమర్పించిన ఆధారాలను పరిశీలించగా.. లీక్ అయిన పేపర్ విస్తృతంగా షేర్ అయిందనేందుకు ఆధారాలు లేవని వివరించారు. బీహార్ లోని హజారీబాఘ్, పాట్నాలలో పేపర్ లీక్ జరిగిందనే విషయాన్ని సీజేఐ అంగీకరిస్తూనే.. అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు పేపర్ వెళ్లిందనేందుకు ఎవిడెన్స్ ఉంటే చెప్పాలని అడిగారు. ఉదయం 9 గంటలకు పేపర్ లీక్ అయిందని, 10:30 గంటలకల్లా అది ముగిసిందని కోర్టు విశ్వసిస్తోందని సీజేఐ తెలిపారు. కోర్టు నమ్మకాన్ని తప్పని నిరూపించే ఆధారాలు ఉంటే వెల్లడించాలని పిటిషన్ దారులకు సూచించారు. సీబీఐ అందించిన నివేదిక ప్రకారం నీట్ యూజీ ప్రశ్నాపత్రం ఎక్కడ ముద్రించారనే విషయం తమకు తెలిసిందని, అయితే, ఆ విషయాన్ని బహిరంగపరిచే ఉద్దేశం తమకులేదని అన్నారు.