Monday, September 25, 2023
Monday, September 25, 2023

పార్లమెంటును అవమానిస్తారా?

. మోదీ చట్టసభలకు ఎందుకు రావడం లేదు
. మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాల్సిందే
. రూల్‌ 267 కింద చర్చ చేపట్టాల్సిందే
. విపక్షాల డిమాండ్‌

న్యూదిల్లీ: లోక్‌సభ, రాజ్యసభను అవమానించడాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆపాలని విపక్షాలు సోమవారం హితవు పలికాయి. మణిపూర్‌ హింసపై కాలపరిమితి లేకుండా సమగ్ర చర్చ కోసం పార్లమెంటుకు రావాలని డిమాండ్‌ చేశాయి. మణిపూర్‌ పరిణామాలపై పార్లమెంటులో సమగ్ర, సవివరమైన చర్చకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ ఉపనాయకుడు ప్రమోద్‌ తివారీ స్పష్టంచేశారు. ఆ రాష్ట్ర పరిణామాలు, ఇప్పటి వరకు జరిగిన హత్యలు, హింసాకాండ, విధ్వంసకాండ గురించి ప్రజలకు పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని స్వయానా ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌సింగ్‌ అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. మణిపూర్‌లో ఎన్ని అత్యాచారాలు జరిగాయో ఎవరికి తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ‘రాజ్యాంగంలోని 75వ ఆర్టికల్‌ ప్రకారం పార్లమెంటుకు ప్రధానమంత్రి జవాబుదారీ. అందుకే పార్లమెంటు లోపలికి వచ్చి ప్రధాని మాట్లాడాలి’ అని తివారీ డిమాండ్‌ చేశారు. ‘దేశంలోనే ఉంటూ లోక్‌సభకు, రాజ్యసభకు రాకుండా ఉండటానికి ప్రధాని సరైన కారణం చెప్పగలరా? మోదీ ఇప్పటికీ లోక్‌సభ, రాజ్యసభను అవమానిస్తున్నారు. ఇది కేవలం లోక్‌సభ, రాజ్యసభను మాత్రమే అవమానించడం కాదు. 130 కోట్లమంది భారతీయులను అవమానించడమే. వాస్తవాలను దాచిపెట్టాలని ప్రధాని ఎందుకు కోరుకుంటున్నారు’ అని తివారీ ప్రశ్నించారు. మణిపూర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిపక్ష ‘ఇడియా’ ఎంపీల బృందం కూలంకషంగా పరిశీలించిందని, తాము చూసిన వాస్తవాలను దేశానికి చెప్పాలని కోరుకుంటున్నామని, అలాంటప్పుడు మణిపూర్‌పై రెండు గంటల చర్చ వల్ల ప్రయోజనం ఏమిటని నిలదీశారు. మణిపూర్‌ హింసాకాండపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ జరగాలని తివారీ డిమాండ్‌ చేశారు. ‘మహాభారతంలో ద్రౌపది ఒక్కరే చెరబట్టబడ్డారు. కానీ ఇక్కడ ఎంతోమంది ద్రౌపదిలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు’ అని మణిపూర్‌ పరిణామాలను ఉదహరిస్తూ చెప్పారు. బాధాకరమేమంటే… కార్గిల్‌ వీరుడి భార్య అత్యాచారం, అవమానాలు ఎదుర్కొందని తెలిపారు. ‘అన్ని కార్యకలాపాలు పక్కన పెట్టి…రూల్‌ 267 కింద మణిపూర్‌పై చర్చను మేము కోరుతున్నాం. అన్ని విషయాలు తెలిసిన ప్రధాని మోదీ సభకు రావాలి. కాలపరిమితి లేకుండా చర్చకు అనుమతించాలి’ అని కాంగ్రెస్‌ నేత డిమాండ్‌ చేశారు.
తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు డెరెక్‌ ఒబ్రెయిన్‌ మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై 8 రోజులు గడిచినా కనీసం 20 సెకండ్ల పాటు ప్రధాని పార్లమెంటుకు రాలేదని విమర్శించారు. భారత ప్రధాని ఎక్కడున్నారని ప్రశ్నించారు. మణిపూర్‌ అంశం చాలా తీవ్రమైం దని, అత్యవసర నిబంధన కింద దీనిపై చర్చించాలని అన్ని పార్టీలు కోరుతున్నాయని చెప్పారు. కానీ ఇందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు. ప్రధాని పార్లమెంటుకు ఎందుకు రావడం లేదు. మణిపూర్‌పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఒబ్రెయిన్‌ స్పష్టంచేశారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం వెళ్లిన తర్వాత ‘ఇండియా’ ప్రతినిధి బృందం మణిపూర్‌ వెళ్లిందని, కొన్ని ఇతర పార్టీలు కూడా రాష్ట్రంలోని వాస్తవిక పరిస్థితిని చూశాయని ఆయన చెప్పారు. ‘మిస్టర్‌ ప్రధానీ…మీరేమనుకుంటున్నారు? పండిట్‌ నెహ్రూ సైతం కీలకమైన అంశంపై రాజ్యసభకు వచ్చి మాట్లాడారు. చర్చలో పాల్గొన్నారు. మాజీ ప్రధానులు అతల్‌ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభకు వచ్చి సమస్యలపై చర్చించారు. రాజీవ్‌గాంధీ సైతం తనపై బోఫోర్స్‌ ఆరోపణలు వచ్చినప్పుడు సభకు వచ్చి మాట్లాడారు. రాజ్యసభలో బోఫోర్స్‌ గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం రాజీవ్‌కు ఉన్నాయి’ అని ఒబ్రెయిన్‌ గుర్తు చేశారు. ‘మిస్టర్‌ ప్రధానీ…మీరు పెద్ద అహంకారి. మీది రాతిగుండె. మణిపూర్‌ మహిళలు, బాలికలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు రెండు నిమిషాల మ్యాగీ న్యూడిల్స్‌ను, రెండు గంటల చర్చను కోరుకోవడం లేదు. రూల్‌ 267 కింద పూర్తిస్థాయి చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాం. దేశ యువతను పక్కదారి పట్టించవద్దు’ అని ఒబ్రెయిన్‌ ఏకిపారేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img