Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఇది పోలీస్‌ రాజ్యం

. జగన్‌ రాష్ట్ర పాలనను డీజీపీకి అప్పగిస్తే సరి
. ప్రజాసంఘాల మహాసభలకు కూడా అనుమతి కావాలా?
. రాష్ట్రంలో పరిస్థితులపై రాష్ట్రపతి, గవర్నర్‌లను కలుస్తాం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర – విజయవాడ : రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను అణచివేసే పనిలోనే పోలీసు వ్యవస్థ నిమగ్నమై ఉంద న్నారు. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. అంగన్‌వాడీ కార్మికుల శాంతియుత ఆందోళన సందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారని… ఈ రకమైన పాలన చేయటం ఏమిటి? అని నిలదీశారు. పోలీసులు రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో టెంట్‌లు వేసుకుని కాపలాకాస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్మికుల అరెస్టులను, తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు బాపట్లలో నిర్వహించేందుకు స్థానిక పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం జరిగిందనీ, డీఎస్పీ సూచన మేరకు బహిరంగసభ స్థలాన్ని కూడా మార్చటం జరిగిందన్నారు. ఇప్పుడు మహాసభలకు అనుమతి లేదని చెబుతూ… వ్యవసాయ కార్మిక సంఘం నేతలకు పోలీసులు నోటీసులు జారీచేయడం దుర్మార్గం అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఇలా జరగలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, జగన్‌ తన పేరును పిచ్చి రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదన్నారు. అసలు ముఖ్యమంత్రికి విజ్ఞత ఉందా? అని ప్రశ్నించారు. ప్రజాసంఘాల మహాసభలు కూడా జరుపుకోకూడదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సొంత కార్లలో వస్తుంటే పోలీసులు వారిని ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో అడ్డుకుని బెదిరిస్తారా? అదేమన్నా ఇండియా, పాకిస్తాన్‌ సరిహద్దా? అంతమంది పోలీసులను మోహరించాల్సిన అవసరమేమొచ్చింది? అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు చలో అసెంబ్లీకి పిలుపునివ్వటం సహజం అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు … ర్యాలీలు, ధర్నాలు, మహాసభలు, చలో విజయవాడ వంటి కార్యక్రమాలు చేయకూడదనే చట్టాన్ని కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తే జగన్‌మోహన్‌రెడ్డి కళ్లు చల్లబడతాయన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందనీ, జగన్మోహన్‌రెడ్డికి పరిపాలన చేయటం చేతకాకపోతే రాష్ట్ర డీజీపీకి పాలనా పగ్గాలు అప్పగించాలని సూచించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు చేసుకుంటే… లిఖితపూర్వకంగా బెదిరించటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశ ప్రజలు తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించలేని కాలం అమృత కాలం ఎలా అవుతుందని, ఇదేనా నరేంద్రమోదీ చెప్పే అమృతోత్సవ్‌, అచ్చేదిన్‌ అని ప్రశ్నించారు. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంత దుర్మార్గం ఏమిటి? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో విపత్కర పరిస్థితులను సృష్టిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి మోదీ ఆశీస్సులు న్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పరిస్థితులపై రాష్ట్రపతి, గవర్నర్‌లను కలిసి వివరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img