ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నేతలకు ఎదురు దెబ్బ తగిలింది.. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్.. అలాగే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాష్ సహా ఇతర వైఎస్సార్‌సీపీ నేతల పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే బెయిల్ తిరస్కరించిన తర్వాత.. వైఎస్సార్‌సీపీ తరఫున లాయర్లు కోర్టుకు చిన్న రిక్వెస్ట్ చేశారు. బెయిల్ తిరస్కరింపబడిన వారిపై రెండు వారాలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.. సుప్రీం కోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వమని అడిగారు. అయితే దీనిపై విచారణ చేపట్టే అంశాన్ని మధ్యాహ్నం పరిశీలిస్తామని చెప్పింది హైకోర్టు.
మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. నిందితుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత కోర్టులో వాదనలు జరిగాయి.. కొద్దిరోజుల పాటూ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వుల్ని కోర్టు పొడిగించింది.
ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లు వేసిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రాఘురాం, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీమంత్రి జోగిరమేష్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.. ఇవాళ బెయిల్ పిటిషన్‌లను తిరస్కరిస్తున్నట్లు తీర్పును ఇచ్చింది. మరి వైఎస్సార్‌సీపీ నేతల అప్పీల్‌పై ఏపీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో మధ్యాహ్నం తేలనుంది.