Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

జోరువానలోనూ కదంతొక్కారు

స్తంభించిన పారిశుద్ధ్యం

రెండోరోజూ పారిశుధ్య కార్మికుల సమ్మె సక్సెస్‌
సమ్మె విరమణ బాధ్యత ప్రభుత్వానిదే : రవీంద్రనాథ్‌
రేపట్నుంచి ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ సిబ్బంది సమ్మె: సుబ్బారాయుడు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సమ్మె రెండోరోజూ విజయవంతమైంది. జోరువానను సైతం లెక్కచేయకుండా కార్మికులు మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట గంటల తరబడి ధర్నాలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ నినాదాలు చేశారు. సమ్మె వల్ల జరిగే నష్టానికి, ప్రజల ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఎన్నికల మేని ఫెస్టోలో 95శాతం వాగ్ధానాలు అమలు చేశామని, తమది సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుం టున్న ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మె రెండోరోజుకి చేరుకోవ డంతో మున్సిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకు పోయింది. నగరాల్లో ఎటు చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. జోరువానలోనూ విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు పెద్దసంఖ్యలో ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తుంటే ప్రభుత్వం 2024 ఎన్నికల్లో తమను గెలిపిస్తే అప్పుడు పరిష్కరిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కార్మిక సంఘాల నాయకులతో సోమవారం మంత్రులు, అధికారులు చర్చల సమయంలో న్యాయబద్ధంగా వ్యవహరించలేదన్నారు. మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇచ్చేలా జీవో జారీ చేయడంతోపాటు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం హెల్త్‌ అలవెన్సులను ఎటువంటి కోత లేకుండా పాత బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ బాబూరావు, ఏఐటీయుసీ అనుబంధ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆసుల రంగనాయకులు, నాయకులు జె.జేమ్స్‌, రమేష్‌, సీఐటీయూ నాయకులు డేవిడ్‌, జ్యోతిబసు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట జోరువానలో నిర్వహించిన ధర్నాలో సీపీఐ సీనియర్‌ నాయకుడు మోదుమూడి రామారావు, సీపీఎం నాయకుడు కొడాలి శర్మ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు యర్రంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌ తాడిగడప మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నాకు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మద్దతు ఇచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట జేఏసీ ఆధ్వర్యాన ధర్నాలు నిర్వహించారు.
హామీలను విస్మరించడం దారుణం: వెలుగూరి రాధాకృష్ణమూర్తి
ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించడం సమంజసం కాదని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి అన్నారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేస్తామని, అందరినీ పర్మినెంట్‌ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని, సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా రెండవ రోజు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు బందెల రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల అంజిబాబు, ఆకిటి అరుణ్‌కుమార్‌, సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు చల్లా మరియదాసు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ కోశాధికారి కోటి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం తగదు: చలసాని రామారావు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా ఎన్నికల సందర్భంగా మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ అమలు చేయకపోవడం దారుణమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని వెంకట రామారావు విమర్శించారు. ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చాట్ల పుల్లారావు, ఇందుపల్లి సత్య ప్రకాష్‌ పాల్గొనగా, ఏలూరులో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, భజంత్రీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ది జోనల్‌ మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నగర కార్యదర్శి ఏ అప్పలరాజు భోజన విరామ సమయంలో కార్మికులకు మద్దతుగా సంఫీుభావం తెలిపి నిరసన తెలిపారు. జంగారెడ్డి గూడెంలో సీపీఐ నాయకులు మన్నవ కృష్ణ చైతన్య, చింతలపూడిలో కంచర్ల గురవయ్య, తుర్లపాటి బాబు, పశ్చిమగోదావరి జిల్లాలో కోనాల భీమారావు, ఎం సీతారాం ప్రసాద్‌, చెల్లబోయిన రంగారావు పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. నరసాపురంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, తణుకులో సీపీఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో
కాకినాడలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె విజయవంతమైంది. స్థానిక కొండయ్య సెంటర్‌ నుండి ప్రదర్శనగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్దకు చేరుకుని రెండవ రోజు కార్యాలయం ఎదుట సమ్మె ప్రారంభించారు. సమ్మెకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ విచ్చేశారు. సామర్లకోటలో 2వ రోజు కార్మికులు సమ్మె నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు పాల్గొన్నారు.
కర్నూలులో
మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కర్నూలు,డోన్‌, ఆదోని, ఎమ్మిగనూరు, నంది కొట్కూరు, నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, గూడూరులో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. డోన్‌లో మున్సిపల్‌ కార్మికులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మిగతా చోట్ల కార్మికులు కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img