Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

తీర్పు నేటికి వాయిదా

చంద్రబాబు హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌పై విచారణ

. ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు
. జైలులో ప్రమాదం పొంచి ఉంది: సిద్ధార్థ లూథ్రా
. ఇంటికంటే రాజమండ్రి సెంట్రల్‌ జైలే క్షేమం: పొన్నవోలు
. కస్టడీకి, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుపై విచారణకు సీఐడీ రెండు పిటిషన్లు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై తీర్పు మంగళ వారానికి వాయిదా పడిరది. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సోమవారం రెండు పక్షాల న్యాయవాదుల వాదనలు వాడివేడిగా సుదీర్ఘంగా సాగాయి. చంద్రబాబుకు జైలులో ప్రమాదం పొంచి ఉందని, హౌస్‌ కస్టడీకి ఇవ్వాలని న్యాయవాది లూథ్రా కోరారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో కరడుగట్టిన, ఆయుధాలు వాడిన నేరస్తులు ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబుకు ప్రాణ ప్రమాదం ఉన్నందువల్లే ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీకి సంబంధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని కోర్టుకు విన్నవించారు. ప్రస్తుతం చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది. అందుకే చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు ఇవ్వండి. మళ్లీ చెబుతున్నా… జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉంది. జైలులో కరుడుకట్టిన నేరగాళ్లు ఉంటారు. ప్రభుత్వం ఆయన భద్రతను తగ్గించింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ అమలులో ఉందని లూథ్రా కోర్టుకు వివరించారు. గౌతమ్‌ నవల్కర్‌ కేసులో హౌస్‌ రిమాండ్‌ ఇవ్వవచ్చు అని సుప్రీం కోర్టు చెప్పిన తీర్పును సైతం కోర్టులో సిద్ధార్థ లూథ్రా ఉదహరించారు. దీనిపై సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు ఇంటికంటే రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే భద్రత ఎక్కువగా ఉంటుందని కోర్టుకు వివరించారు. చంద్రబాబు ఆరోగ్య కారణాలను పరిశీలిస్తున్నాం. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే జైలులో ఆయన భద్రతపై అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ కంటే అదనపు సెక్యూరిటీ కల్పించాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. చంద్ర బాబు పూర్తి ఆరోగ్యం, పూర్తి భద్రత మధ్య ఉన్నారు. సీఆర్పీసీలో హౌస్‌ అరెస్ట్‌ అనేదే లేదు. రక్షణ విషయంలో చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాజమండ్రి జైలు చుట్టూ ప్రహరీతో చాలా పటిష్టంగా ఉంటుంది. ఇక పిటిషనర్‌ ఆరోగ్యం కోసం 24/7 వైద్యులు అక్కడే ఉంటారు. ఆయ ఆరోగ్యంపై వైద్యులు పూర్తి శ్రద్ధ వహిస్తారు. అందుకే పిటిషనర్‌కు ఇల్లు కన్నా జైలే సురక్షితమని పొన్నవోలు కోర్టుకు వివరించారు. తన వాదనలకు కొనసాగింపుగా అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సుబ్రమణ్యం వాదన వినిపిస్తారని పొన్నవోలు కోర్టుకు తెలిపారు. అనంతరం సుబ్రమణ్యం వాదనలు ప్రారంభించారు. రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది.
ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వ్యవహారంలో చంద్రబాబుపై మరో పిటిషన్‌
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ వేసింది. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. మరోవైపు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబును కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు అందులో పేర్కొన్నారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్‌ కోసం పీటీ వారెంట్‌ (ప్రిజనర్‌ ఇన్‌ ట్రాన్సిట్‌) కోరింది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై చంద్రబాబును విచారించడానికి కోర్టు అనుమతిని సీఐడీ కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేశ్‌ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది. కాగా, ప్రభుత్వం భారీ కుంభకోణంగా పేర్కొంటున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డాక్యుమెంట్లను పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిద్ధార్థ లూథ్రా మరో పిటీషన్‌ దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img