. అమిత్‌షా, ఖట్టర్, విజ్ రాజీనామా చేయాలి
. శుభకరణ్ సింగ్ నిందితులను శిక్షించాలి
. రైతుల డిమాండ్ బ్లాక్ డే విజయవంతం
. పంజాబ్‌హర్యానాలో మిన్నంటిన నిరసనలు
. రైతు నిర్బంధాలు ` బాష్పవాయువుతో అడ్డుకున్న పోలీసులు
న్యూదిల్లీ: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న తమపై ఖాకీ క్రౌర్యాన్ని, పాలకుల దౌర్జన్యాలను సహించేది లేదని రైతులు ఉద్ఘాటించారు. ఆందోళనలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన శుభకరణ్ సింగ్(22)కు న్యాయం కోసం శుక్రవారం బ్లాక్‌డే/ఆక్రోశ్ దినానికి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించింది. పంజాబ్, హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మ దహనాలు, టార్చ్‌ర్యాలీలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. యువరైతు మృతి బాధ్యులను ఉపేక్షించరాదని, హర్యానా పోలీసులపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, రైతులను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు లాఠీలు, బాష్పవాయువు ప్రయోగించాయి. అనేక మంది రైతులు అరెస్టు అయ్యారు. హర్యానాలోని హిసార్ జిల్లా ఖేరిచోప్తా వద్దకు చేరుకున్న రైతులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. నిరసనకారులను పంజాబ్`ఖనౌరి సరిహద్దుకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. రైతు నేత సురేశ్ కోఠ్ సహా అనేక మందిని నిర్బంధించారు. ఎస్‌కేఎంలో భాగంగా ఉన్న భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) అధ్వర్యంలో పంజాబ్‌లోని 17 జిల్లాలు… 47 ప్రాంతాల్లో ఆందోళనలు, ప్రదర్శనలు నిర్వహించినట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ కోక్రికలన్ తెలిపారు. అమిత్‌షా, ఖట్టర్, అనిల్ విజ్ దిష్టిబొమ్మలు దహనం చేశామన్నారు. అమృత్‌సర్‌లోని న్యూ గోల్డెన్ గేట్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దోకే, మహిమా, పండోరి, మోడే, రటోకేతో పాటు సరిహద్దు వెంబడి అనేక గ్రామాల్లో నిరసనలు జరిగినట్లు ఎస్‌కేఎం నేత రతన్‌సింగ్ రంధావా వెల్లడిరచారు. లూథియానాలో ఎస్‌కేఎంతో పాటు కార్మిక సంఘాలు మినీ సెక్రటేరియట్ ఎదుట ధర్నా చేశారు. అమిత్‌షా, ఖట్టర్, అనిల్ విజ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. హోషియార్పూర్‌లోనూ ఆందోళనలు పెద్దఎత్తున జరిగాయి. కేంద్రానికి, హర్యానా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మార్మోగాయి. ఎంఎస్‌పీ చట్టంతో పాటు రైతుల డిమాండ్లు అంగీకరించాలని డిమాండ్ చేశారు. యువరైతు మరణానికి నిరసనగా వాహనాలకు నల్ల జెండాలు కట్టుకొని…సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకులు, రైతులు వీధుల్లో తిరిగారు.
న్యాయం కావాలి…పరిహారం కాదు: రైతు కుటుంబం
యువరైతు శుభకరణ్ సింగ్ (22) కుటుంబానికి పంజాబ్ ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం ప్రకటించింది. మృతుడి సోదరికి ఉద్యోగమిస్తామని హామీ ఇచ్చింది. దీనిని బాధిత కుటుంబం తిరస్కరించింది. తమ బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. డబ్బు, ఉద్యోగం అక్కర్లేదని స్పష్టంచేసింది. దోషులను శిక్షించేంత వరకు శుభకరణ్ సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం జరగనివ్వబోమని రైతు నేతలు తేల్చిచెప్పారు. ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రైతు నేత సర్వన్ సింగ్ పంధేర్ విమర్శించారు. తామిచ్చిన పరిహారాన్ని అంగీకరించాలని బాధిత కుటుంబాన్ని బుజ్జగించేందుకు సమయం, శక్తిని వృధా చేస్తోంది తప్ప బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ధైర్యం చేయడం లేదని వ్యాఖ్యానించారు. ‘మాకు పరిహారం అక్కర్లేదు. మా పిలుపుతో శుభకరణ్ కుటుంబానికి మద్దతిచ్చేందుకు ప్రపంచ రైతులు కదలివస్తారు’ అని పంధేర్‌తో పాటు బీకేయూ అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దలేవాల్ తెలిపారు. కాగా, ‘హర్యానా పోలీసులు ఎన్‌ఎస్‌ఏ అమలు చేస్తే ఏం జరుగుతుంది… మమ్మల్ని జైళ్లకు పంపుతారు అంతే కదా! రండి మమ్మల్ని తీసుకెళ్లండి. మేము ఇక్కడే ఉన్నాం’ అంటూ పంధేర్, దలేవాల్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. అనేకమంది రైతులను హర్యానా భద్రతా దళాలు ఈడ్చుకెళ్లినట్లు దలేవాల్ ఆరోపించారు. ఐదుగురిని ఎక్కడికి తరలించారో తెలియదన్నారు. ఇంతకుముందు ఇద్దరిని తీసుకెళ్లారని చెప్పారు. తమ వాళ్లను అప్పగించాలని హర్యానాపై ఒత్తిడి తెచ్చే దమ్ముందా అని పంజాబ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
గుండెపోటుతో రైతు మృతి: పంధేర్
రైతుల పోరాటం కొనసాగుతున్న వేళ నాలుగో మరణం సంభవించింది. ఖనౌరీ సరిహద్దు వద్ద ఆందోళనలో పాల్గొన్న దర్శన్ సింగ్(62) గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలారు. ఆయన మరణాన్ని పంధేర్ ధ్రువీకరించారు. ఇంతకుముందు చనిపోయిన ముగ్గురికి ఇచ్చినట్లుగానే దర్శన్‌సింగ్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అమరుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్లు పంధేర్ వెల్లడిరచారు. కాగా, గురువారం అర్ధరాత్రి దర్శన్‌సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే పట్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో పాటియాలాలోని రాజేంద్ర ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఆయన మరణించారు. భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించిన కారణంగానే దర్శన్ సింగ్ మరణించాడని ఆయన కుటుంబం ఆరోపించింది. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 15 రోజుల క్రితమే దర్శన్ సింగ్ కుమారుడికి వివాహం జరిగింది.
దిల్లీ చలోకు భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) మద్దతు
దిల్లీ చలోకు భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) మద్దతు ప్రకటించింది. రైతులకు మద్దతుగా దక్షిణ భారతంలో 200కుపైగా మండలాల్లో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో సంఫీుభావ ర్యాలీలు, మెమోరాండాల అందజేత జరిగినట్లు కిసాన్ మజ్దూర్ యూనియన్ నేత మహేశ్ చౌదరి వెల్లడిరచారు. జాతీయస్థాయి రైతాంగ ఉద్యమంలో కార్మికులు, గిరిజనుల డిమాండ్లకు ప్రాధాన్యతివ్వడం ఇదే మొదటిసారన్నారు. కాగా, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) అధ్యక్షుడు హరిజిందర్ సింఫ్‌ు ధామి శనివారం ఉదయం 8 గంటలకు శంభు సరిహద్దును సందర్శిస్తారు. ఇదిలావుంటే, దిల్లీ చలో మార్చ్‌లో భాగంగా శంభు సరిహద్దు లేక ఖనౌరి సరిహద్దు వద్దకు వెళ్లబోమని, రాష్ట్రంలోనే నిరసనలు కొనసాగిస్తామని జోగిందర్ సింగ్ ఉగ్రహన్ తెలిపారు. ఆయన సంగ్రూర్‌లో రైతులతో మాట్లాడుతూ ‘ఖనౌరి, శంభు సరిహద్దుల వద్ద ఆందోళనలకు పంధేర్, దలేవాల్ బాధ్యులు. మా మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. రైతాంగానికి అన్యాయం జరుగుతుంటే దానిని ఎదిరించడం నైతిక బాధ్యతగా ఆందోళనలు చేస్తున్నాం’ అని అన్నారు.