. బలవంతంగా మూసివేత
. బాబు అరెస్టుతో ముందు జాగ్రత్త చర్యలు
. విద్యార్థుల మండిపాటు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు జరగకుండా చేయడానికి పోలీసులు నానాతంటాలు పడుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా యువత నిరసనలు, ఆందోళనకు దిగుతారనే సమాచారంతో ముందుగానే హడావుడీ చేస్తూ…విమర్శలకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలకు దిగింది. బాబుతో మేము’ పేరుతో దీక్షలు చేపట్టింది. అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర బంద్ నిర్వహించిన విషయం విదితమే. తర్వాత నిరాహారదీక్షలు కొనసాగిస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తమై టీడీపీ ఆందోళనలపై ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు ఉద్యమాలకు రాకుండా చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగా కాలేజీలను మూయిస్తున్నారు. విజయవాడలోని వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లిన పోలీసులు తరగతులు నిలిపివేయించారు. కళాశాలలకు సెలవులు ఇవ్వాలని యాజమాన్యంపై ఒత్తిడి చేశారు. కాలేజీలు మూయించి…విద్యార్థులను బయటకు పంపారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు చేయాలని వాట్సాప్ సందేశాలు బహిర్గతం కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చదువు కోసం విద్యార్థులు కళాశాలలకు వెళ్తే, వారిని బలవంతంగా బయటకు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐటీ ఉద్యోగుల తరహాలో…
చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కడం చర్చనీయాంశమైంది. అదే బాటలో బెంగళూరులోనూ ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. విజయవాడలోని కొన్ని కళాశాలల విద్యార్థులు ఆందోళనలకు సిద్ధమవ్వగా పోలీసులు అదుపు చేశారు. కళాశాలల పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బలగాలను రంగంలోకి దించారు. కళాశాలల ప్రధాన మార్గాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. ఆయా పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధత అవసరముంది. ఈ సమయంలో పోలీసులు కాలేజీలు మూసివేయాలని ఆదేశించారు. కళాశాలల యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చారు. చేసేది లేక యాజమాన్యాలు సైతం కాలేజీలు మూసివేశారు. టీడీపీ సానుభూతిపరులు ఎక్కువుగా ఉండే ప్రాంతాల్లోని కాలేజీల వద్ద పోలీసులు నిఘా పెంచారు. రాష్ట్రంలోని అనేక కళాశాలల్లోనూ నిఘా ఉంచినట్లు సమాచారం. టీడీపీ-జనసేన పొత్తును స్వాగతిస్తూ విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయం ఎదుట పోస్టర్లు వెలవడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటి తొలగింపులో పోలీసులకు, జనసేన నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల వ్యవహార శైలిపై విపక్షాలు మండిపడుతున్నాయి.