. కోనేరు రంగారావు కమిటీ సిపార్సులు అమలు చేయాలి
. భూపంపిణీ చట్టాలు అమలు జరగాలి
. 90 ఏళ్లుగా భూమి కోసం ఎర్రజెండా పోరు
. బాపట్ల బహిరంగ సభలో వక్తలు
. ఉత్సాహపూరితంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభం
రాష్ట్రంలో ప్రభుత్వ బంజరు భూములు పేద వర్గాలకు పంపిణీ చేసినప్పుడే వారి జీవితాల్లో వెలుగు నిండుతుంది. 90 ఏళ్లుగా భూ పంపిణీ కోసం ఎర్రజెండా రాజీలేని పోరాటం చేస్త్తోంది. ఈ పోరాటంలో అనేక విజయాలు సాధించినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల భూ పంపిణీ చట్టాలకు తూట్లు పడుతున్నాయి. సాగుభూమి పేదలకు పంపిణీ చేసి సామాజిక న్యాయం, ఉపాధి కల్పనకు ప్రభుత్వాలు పూనుకోవాలి. ఇది ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 22వ రాష్ట్ర మహాసభలు బాపట్లలో ఉత్సాహభరిత వాతావరణంలో సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది వ్యవసాయ కార్మికులు బాపట్లలో కదం తొక్కారు. అనంతరం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీపీఐ, బీకేఎంయూ జాతీయ, రాష్ట్ర నాయకులు ప్రసంగించారు.
విశాలాంధ్ర బ్యూరో ` బాపట్ల : బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను హరించి వేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. పోరాడి సాధించుకున్న చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చి వేస్తున్నదని మండిపడ్డారు. వ్యవసాయ కార్మిక సంఘం 22వ రాష్ట్ర మహాసభలు బాపట్లలో సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ముందుగా బాపట్ల పురవీధుల్లో రాష్ట్ర నలమూలల నుండి తరలివచ్చిన కార్మిక కూలిదండు మహాప్రదర్శన నిర్వహించింది. అనంతరం రైల్వేస్టేషన్ వద్ద వేములపల్లి శ్రీకృష్ణ సభా ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కె.నారాయణ మాట్లాడుతూ పోరాడే హక్కు లేకుండా చట్టాలను సవరిస్తున్నారన్నారు. నాడు రాష్ట్రపతిగా కోవింద్‌ను అడ్డుపెట్టుకొని ఎస్సీ చట్టాను మార్చవేశారని, నేడు ద్రౌపదీ ముర్ము సంతకంతో అటవీ చట్టాలను మార్చి… సారవంతమైన అటవీ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. మణిపూర్‌లో గిరిజనులను అణగదొక్కి అక్కడ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టారని నారాయణ తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయకపోగా అదానీ కంపెనీలకు రూ.13 లక్షల కోట్లు రాయితీ ఇచ్చారని విమర్శించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదానీ గంజాయి స్మగ్లర్‌గా ఎదిగాడని, నేడు ప్రధాని అయిన తర్వాత దేశంలోని అన్ని పోర్టులను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. అదానీకి చెందిన ముద్ర పోర్టులో కోట్లాది రూపాయల విలువ చేసే మత్తుమందులు స్వాధీనం చేసుకున్నా చర్యలు తీసుకోలేదని చెప్పారు. సరఫరాదారులను పట్టుకోకుండా ఎవరో ఎక్కడో గంజాయి వాడారని కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టాల హామీలు అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను నాశనం చేస్తున్నదని విమర్శించారు. దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, జగన్ అని నిందించారు. వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ప్రశ్నించే వారిని జైలులో పెడుతున్నారని, జగన్‌మోహన్ రెడ్డి, అవినాశ్‌రెడ్డి, కవిత లాంటి వారిని బయట ఉంచి రాజకీయం నడిపిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం మరింత బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి వ్యవసాయ కార్మికుడికి భూమి దక్కాలని నాడు చంద్ర రాజేశ్వరరావు నాయకత్వంలో దేశవ్యాప్తంగా పోరాటం చేస్తే జైళ్లన్నీ నిండిపోయాయని గుర్తుచేశారు. ప్రభుత్వాల కంటే కమ్యూనిస్టులే పేదలకు పెద్దఎత్తున సాయం చేశారని, నాటి ఉద్యమాల స్ఫూర్తితో కార్మికులు రాజకీయ చైతన్యంతో ఉధృత పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యం ఖూనీ: రామకృష్ణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. భూమి కోసం-భుక్తి కోసం పోరాడిరది ఎర్రజెండా మాత్రమేనని స్పష్టంచేశారు. దున్నేవాడికి భూమి నినాదంతో పెద్దఎత్తున భూపోరాటాలు సాగించిన చరిత్ర కమ్యూనిస్టులదేనన్నారు. భూపోరాట ఉద్యమాల్లో పది లక్షల మంది అశవులు బాశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో బంజరు భూములను పేదల నుండి లాక్కునేందుకు జులై 31న భూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజ ఉద్యమాలను అణిచివేసి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం, దొంగల రాజ్యం నడుస్తోందని, న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తున్న అంగన్‌వాడీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని మండిపడ్డారు. హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన అంగన్‌వాడీలను ముందస్తు అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రజల్లో చైతన్యం పెరగాలని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, గడిచిన నాలుగున్నరేళ్లలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి నాటకాలాడుతున్నారని చెప్పారు. సంక్షేమ పేరుతో ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క దళితుడికైనా ఎకరా భూమి పంచారా అని ప్రశ్నించారు. ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని, ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా 28 రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పడి ముందుకు వెళ్లడం శుభపరిణామమన్నారు. దేశాన్ని రక్షించండి-రాష్ట్రాన్ని కాపాడండి అనే నినాదంతో వ్యవసాయ కూలీలు, కార్మికులు ప్రజా పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి వ్యవసాయ కార్మికుడు భూ యజమాని కావాలి: జల్లి విల్సన్
ప్రభుత్వ బంజరు భూములు పేదవాడికి పంపిణీ చేయడం ద్వారా వారిని భూ యజమానులను చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లి విల్సన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు కొత్త భూ చట్టాలు తీసుకువస్తున్నాయని విమర్శించారు. దీనిపై ప్రతి వ్యవసాయ కూలీ రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భూపంపిణీ కోసం 90 ఏళ్లుగా ఆందోళన చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వేసిన కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి…ఆ కమిటీ సిఫార్సులకు తూట్లు పొడుస్తున్నారని చెప్పారు. సంక్షేమంతో పాటు భూమి లేని పేదలకు భూములు పంచాలని, వ్యవసాయ కార్మికులకు రూ.5 వేల పింఛను ఇవ్వాలని, పేదలకు ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మూడు రోజులపాటు బాపట్లలో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో అనేక తీర్మానాలు ఆమోదించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
తొలుత అతిథులను వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ వేదికపైకి ఆహ్వానించగా ఆహ్వాన సంఘం కార్యదర్శి సింగరకొండ వందన సమర్పణ చేశారు. సభలో మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్‌రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ కోటేశ్వరరావు, మధు, ఎంఎల్ నారాయణ, రాష్ట్ర మహాసభల ఆహ్వానసంఘం ఉపాధ్యక్షులు ఆర్.వెంకట్రావు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జేబీ శ్రీధర్, కోశాధికారి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్యేలు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బండి వెంకటేశ్వరరావు, బి.కేశవరెడ్డి, సి.సుబ్రమణ్యం, చిలుకూరి వెంకటేశ్వరరావు, కాబోతు ఈశ్వరరావు, ఆలమంద ఆనందరావు, టి.కృష్ణప్ప, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అధ్యక్షుడు పి.చంద్రనాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్.రామకృష్ణ, పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పథకం సమగ్ర అమలుకు పోరాటం: రామమూర్తి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సమగ్ర అమలు కోసం కార్మికులు పోరాటం సాగించాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) జాతీయ ఉపాధ్యక్షుడు కె.రామమూర్తి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని గుర్తుచేశారు. పథకం ప్రారంభ సమయంలో 2.23 కోట్ల మంది వ్యవసాయ కార్మికులకు లబ్ధి చేకూరిందని, నేడు దీనిని నరేంద్ర మోదీ 63 వేల మందికి కుదించి వేశారని మండిపడ్డారు. ఈ పథకం కింద ప్రతి కార్మికుడికి ఉపాధి దక్కేందుకు ఐక్య పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మివేస్తోందని విమర్శించారు. ఎల్‌ఐసీ మొదలు విమానాశ్రయాలు, ఓడరేవులను అదానీ వంటి కార్పొరేట్ మిత్రులకు అప్పగించిందన్నారు. మోదీ సర్కారు రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తోందని, దీనిద్వారా మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. దేశాన్ని నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్ద దించడంలో కార్మికవర్గం క్రియాశీల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున భూ పోరాటాలు నిర్వహించిందని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన చరిత్ర ఉందన్నారు. బాపట్లలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు కార్మిక ఉద్యమం బలపడేందుకు దోహపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.