కార్మిక హక్కుల రక్షణకు ఉద్యమాలు ఉధృతం
బీజేపీ విధానాలతో అశాంతి, ఆర్థిక సంక్షోభం
ఏఐటీయూసీ జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో అమర్‌జిత్ కౌర్ పిలుపు
(తిరుప్పూర్ నుంచి డి.సోమసుందర్)
కోట్లాది శ్రామికుల జీవనానికి విపత్కరంగానూ, భారతీయ సామాజిక జీవితానికి హానికరంగానూ తయారైన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కార్మికవర్గం గట్టిగా పూనుకోవాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధానకార్యదర్శి అమర్‌జిత్ కౌర్ పిలుపునిచ్చారు. తమిళనాడులోని వస్త్రపారిశ్రామిక నగరం తిరుప్పూర్‌లో శుక్రవారం నుండి మూడు రోజుల పాటు జరగనున్న ఏఐటీయూసీ జనరల్ కౌన్సిల్ సమావేశాల ప్రారంభసభలో అమర్‌జిత్ కౌర్ ప్రసంగించారు.
ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షుడు రామేంద్ర కుమార్ అధ్యక్షత వహించారు. అలెప్పిలో జరిగిన 42వ మహాసభ అనంతరం దేశంలో సంభవించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలపైనా, ఇటీవల కాలంలో ఏఐటీయూసీ నిర్వహించిన కార్యకలాపాలపైనా, కేంద్ర కార్మికసంఘాల ఉమ్మడి పోరాటాలపైనా అమర్‌జిత్ కౌర్ సవివరమైన నివేదికను ప్రవేశపెట్టారు. తీవ్ర జాతీయవాదం, హిందూ ఆధిక్యతావాదం పేరుతో హిందూ`ముస్లిం విభజన భావోద్వేగాలను రెచ్చగొడుతూ, వాటి ముసుగులో కొనసాగిస్తున్న ఆర్థిక దోపిడీ విధానాల నిజస్వరూపాన్ని ప్రజలకు వివరించాలని, కార్మికవర్గ హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అమర్‌జిత్ కౌర్ ఉద్ఘాటించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‘అమృత్‌కాల్ బడ్జెట్’ పేరుతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మోసపూరితమైనదని, శ్రామిక ప్రజలను దగా చేసి ప్రధానమంత్రికి ఇష్టులైన ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక అధిపతులకు జాతీయ సంపదను దోచిపెట్టడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందిందని ఆమె విమర్శించారు. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారని, వైద్య ఖర్చులు భరించలేక కోట్లాది మంది ప్రజలు దారిద్య్రంలోకి దిగజారిపోతున్నారని ఆమె వివరించారు.
బీజేపీ ఆర్థిక, సామాజిక విధానాలు సమాజంలో తీవ్ర అశాంతికి, ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తున్నాయని అమర్‌జిత్ కౌర్ వివరించారు. ఈ సందర్భంగా ఆక్స్‌ఫామ్ నివేదికను, జాతీయ నమూనా సర్వే నివేదికను ఆమె ఉటంకించారు. కొద్దిమంది కార్పొరేట్ అధిపతుల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తున్నదని ఆరోపించారు. దళిత, మైనారిటీ మహిళపై అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం మానవ హక్కుల పోరాటమని, అందులో ఏఐటీయూసీ శ్రేణులు అగ్రభాగాన నిలవాలని ఆమె కోరారు.
వేదికపై ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు ఎంఎన్ యాదవ్, బంత్ సింగ్ బ్రార్, విద్యాసాగర్ గిరి, డి.ఆదినారాయణ, ఎంఎన్ వెంకటాచలం, కేపీ రాజేంద్రన్, హెచ్‌ఎస్.శేషాద్రి, రామేన్ దాస్, మహమ్మద్ యూసుఫ్, సొహల్ సింగ్, కార్యదర్శులు సుకుమార్ దామ్లే, క్రిస్టఫర్ ఫోన్సెకా, వహీదా నిజామ్, జి.ఓబులేసు, సి.శ్రీకుమార్, టీఎన్ మూర్తి, సీజే జోసఫ్, కునాల్ రావత్, ఉషా సాహ్నీ, బబ్లీ రావత్ తదితరులు ఉన్నారు.
ఏఐటీయూసీ మూడురోజుల జనరల్ కౌన్సిల్ సమావేశాలు తిరుప్పూర్ నగరంలోని రామస్వామి ముత్తమ్మాళ్ తిరు మహామండపంలోని కామ్రేడ్ టి.సుందర్ రాజన్ హాలులో ప్రారంభమయ్యాయి. తొలుత ఏఐటీయూసీ పతాకాన్ని వయోవృద్ధ కార్మికనాయకుడు, తిరుప్పూర్ వస్త్ర కార్మికోద్యమ నేత సీకే రామస్వామి ఎగురవేశారు. అమరవీరుల స్మారకస్థూపం వద్ద ప్రతినిధులు పుష్పాంజలి ఘటించి జోహార్లు అర్పించారు. అలెప్పీ మహాసభ అనంతరం కన్నుమూసిన కార్మికనేతలకు, ఉద్యమకారులకు, వివిధరంగాల ప్రముఖులకు సంతాపం ప్రకటిస్తూ విద్యాసాగర్ గిరి ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించి సమావేశం రెండునిముషాలు మౌనం పాటించింది. జనరల్ కౌన్సిల్ సమావేశాల ఆహ్వానసంఘం అధ్యక్షుడు, తిరుప్పూర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, సీపీఐ నేత ఆర్. బాలసుబ్రహ్మణ్యన్ స్వాగతం పలికారు. ఆహ్వానసంఘం ప్రధానకార్యదర్శి పీఆర్ నటరాజన్ తిరుప్పూర్ జిల్లా కార్మికోద్యమ పూర్వాపరాలు వివరించారు. జనరల్ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా నగర ప్రధాన కూడళ్లను, రహదారులను అరుణ పతాకాలతో అలంకరించారు. సమావేశ ప్రాంగణంలో భారతీయ కార్మికోద్యమ నేతల, తమిళనాడు స్వాతంత్య్ర పోరాట యోధుల, సామాజిక సాంస్కృతిక ఉద్యమకారుల, పోరాటాల్లో అశువులు బాసిన అమరవీరుల చిత్రపటాలు ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుండి మూడువందల మంది సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు సమావేశాలకు హాజరయ్యారు.