Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

మోదీని దించుదాం – దేశాన్ని కాపాడదాం

. ప్రభుత్వరంగాన్ని నాశనంచేస్తున్న ఎన్డీయే
. విశాఖ ఉక్కు పరిరక్షణకు అవిశ్రాంత పోరు
. సీపీఐ బస్సు యాత్ర ప్రారంభ సభలో అమర్‌జిత్‌ కౌర్‌

విశాఖ ఉక్కు కార్మికుల పోరాటం స్టీల్‌ ప్లాంట్‌కి సంబంధించినది మాత్రమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశానికే ప్రమాదం, ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలి. మోదీని గద్దె దించితేనే దేశానికి భద్రత ఏర్పడుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో మోదీ అన్నీ అబద్దాలే చెప్పారు.

విశాలాంధ్ర – విశాఖ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశానికే ప్రమాదమని, ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ అన్నారు. మోదీని గద్దె దించితేనే దేశానికి భద్రత ఏర్పడుతుందని చెప్పారు. ప్రభుత్వ రంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నాశనం చేయడానికి పూనుకున్నదని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం దేశభక్తితో కూడుకున్నదని అన్నారు. విశాఖ ఉక్కు కార్మికుల పోరాటం ఒక్క స్టీల్‌ ప్లాంట్‌ కి సంబంధించినది మాత్రమే కాదని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమన్నారు. విశాఖలోని కూర్మన్నపాలెం వద్ద స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న విశాఖ ఉక్కు కార్మికుల నిరసన దీక్ష శిబిరం వద్ద ‘రాష్ట్రాన్ని రక్షించండి – దేశాన్ని కాపాడండి’ నినాదంతో సీపీఐ ప్రచార జాత – బస్సు యాత్ర గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ పాలన ప్రమాదకరంగా మారిందని, ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేసిందనీ, దేశ సంపదను కొల్లగొడుతున్నారన్నారు. మోదీ పాలనలో 80 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని, కనీస సదుపాయాలైన విద్య, వైద్యం, తాగునీరు అందడం లేదన్నారు. విద్యారంగాన్ని కాషాయీకరణ చేయడంలో భాగంగానే సిలబస్‌లో కూడా మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, ప్రతి కుటుంబానికి 15 లక్షలు నల్లధనాన్ని పంచి పెడతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ఆ హామీలను గాలికొదిలి కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెడుతున్నారని విమర్శించారు.
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ఇది చూసి ఆనందిస్తున్న మోదీ శాడిస్టు ప్రధాని అని అమర్‌జిత్‌ కౌర్‌ విమర్శించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఉపాధి లేక యువత ఆందోళన చెందుతున్నారని, వేతనాలు తగ్గి కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం దేశంలో ఆత్మహత్యలు పెరిగాయని, మహిళలపై దాడులు పెరిగాయని, కోవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో లక్షలాది మంది ప్రజలు అనేక కష్టాలు పడి కాలినడకన స్వగ్రామాలకు వెళ్లారని ప్రజల కష్టాలపై ప్రధాని నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. పార్లమెంటులో అవిశ్వాసం ప్రవేశ పెట్టేంత వరకు మణిపూర్‌ అల్లర్లపై ప్రధాని మోదీ మాట్లాడలేదని, అల్లర్ల నేపథ్యంలో ఇప్పటివరకు మణిపూర్‌ని సందర్శించలేదన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో మోదీ అన్నీ అబద్దాలే చెప్పారన్నారు. ఆ ప్రసంగం ఎన్నికల ప్రసంగంలా ఉందన్నారు. ప్రజల తీర్పు రాకముందే తరువాత ప్రధాని కూడా తానే అని స్వయంగా ప్రకటించేసుకున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై మోదీకి నమ్మకం లేదని స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ కూడా తన జేబులోనే ఉన్నట్టుగా భావిస్తున్నారని చెప్పారు. మోదీ పాలనలో ధనికులు, పేదల మధ్య అసమానతలు పెరిగాయని చెప్పారు. సంపన్నుల ఆదాయం పెరుగుతుండగా పేదల ఆదాయాలు తగ్గుతున్నాయని చెప్పారు. దేశంలోని మీడియా ప్రధాని పరివారం.. అదానీ, అంబానీల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. అందువల్ల దేశంలోని మీడియా మోదీకి కావాల్సిందే చూపిసున్నదని, ప్రజల పోరాటాలను చూపించదని చెప్పారు. దేశ ప్రజలను అబద్దాలతో మోసగిస్తున్న మోదీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని అమర్‌జిత్‌ కౌర్‌ పిలుపునిచ్చారు.

రానున్నవి మంచి రోజులు: రామకృష్ణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ మోదీకి వ్యతిరేకంగా 26 రాజకీయ పార్టీలు ఒకే వేదిక పైకి వచ్చి బెంగుళూరులో సమావేశమయ్యాయని, ముంబైలో మరో సమావేశం నిర్వహించనున్నాయని తెలిపారు. దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు 33 కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి రావడం వల్లే స్టీల్‌ ప్లాంట్‌ ఇంకా ప్రభుత్వ రంగంలో కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని పోలవరం, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రత్యేక హోదాను విస్మరించారని, రైల్వే జోన్‌ ఊసెత్తడం లేదని, కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావన కూడా లేదని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ శాసనసభలో వామపక్ష పార్టీల సభ్యులు ఉంటే సహజ వనరుల దోపిడీని అడ్డుకోగలిగే వారిని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర పాలకుల్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ అదానీ, అంబానీలకే మోదీ పాలన బావుందని అన్నారు. గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టారని విమర్శించారు. స్టీల్‌ ప్లాంట్‌ వల్ల ఒకసారి నిర్వాసితులైన గంగవరం ప్రజలు గంగవరం పోర్టు వల్ల రెండోసారి నిర్వాసితులుగా మారారని, సముద్రంలోకి వేటకు వెళ్ల్లే అవకాశం లేకుండా దారిని మూసేశారని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కి ముడి సరుకులను గంగవరం పోర్టు నిలుపుదల చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమని తెలిపారు. అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ దిల్లీలో రైతులు పోరాటం చేసి రైతు చట్టాలకు వ్యతిరేకంగా మోదీ మెడలు వంచారని అన్నారు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పోరాటం కూడా విజయం సాధిస్తుందని అకాంక్షించారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం కార్మికులు పెద్ద ఎత్తున అనేక రూపాల్లో పోరాటం చేస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం కేంద్రంలోని మోదీ పాలనకు వంతపాడుతోందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం 917 రోజులకు చేరుకుందని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పారు. ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమని తెలిపారు.
సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు స్వాగతం పలికారు. ఈ సభలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, కార్యదర్శివర్గ సభ్యులు పి హరినాదరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెేవీవీ ప్రసాద్‌, సీఐటీయూ నాయకుడు అయోధ్యరామ్‌, ఇంటక్‌ నాయకుడు మంత్రి రాజశేఖర్‌, సిపిఐ కార్పొరేటర్‌ ఏజేస్టాలిన్‌, ఏ ఐ వై ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ లెనిన్‌ బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌ బాబు, మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ విమల, ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి ఎస్‌ జె అచ్యుతరావు, సీపీఐ, ఏఐటీయూసీ, ప్రజా సంఘాల నాయకులు, విశాఖ ఉక్కు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు తప్పెటగుళ్లు కళాకారుల నృత్యాలు, ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గేయాలు సభికులను ఆలోచింపచేశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img