Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

విశృంఖలం

శృతిమించుతున్న సోషల్‌ మీడియా ప్రచారం
పత్రికల్లో అచ్చుకాని వార్తలకు ‘లోగో’లు అటాచ్‌
ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా విమర్శల దాడి
మహిళలపై జుగుప్సాకర పోస్టింగ్‌లు
సీఐడీ తీరు వివాదాస్పదం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ అనుకూల సోషల్‌ మీడియా విభాగం తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. ఇప్పటివరకు విమర్శలు, తీవ్ర విమర్శలకే పరిమితమైన ఈ ప్రచారం పూర్తిగా గాడి తప్పింది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షపార్టీలకు సోషల్‌ మీడియా విభాగాలున్నాయి. వీటి ద్వారా ఒకరిపై మరొకరు విమర్శనాత్మక పోస్టింగ్‌లు పెడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రజలకు చేసిన వాగ్దానాలు, ప్రస్తుతం వాటికి భిన్నంగా నడుస్తున్న ఆయన పాలనా తీరును టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ఎండగడుతోంది. ఉదాహరణకు ప్రతిపక్ష నేతగా జగన్‌ ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దుపై… అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పూర్తి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే అమరావతి రాజధానికి సంబంధించి చంద్రబాబుకి ఇక్కడ ఇల్లు కూడా లేదని, తాను మాత్రం ఇక్కడ ఇల్లు, కార్యాలయం ఏర్పాటు చేసుకున్నానని, తాను చంద్రబాబు కంటే మంచి రాజధాని కడతానని ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. అలాగే ఇతరత్రా హామీలన్నింటినీ ఆయా సందర్భాల్లో మాట్లాడిన వీడియోలను టీడీపీ సోషల్‌ మీడియా విభాగం పోస్టు చేస్తూ…మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్‌ ఎలా మాట తప్పాడో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వైసీపీ సోషల్‌ మీడియా కూడా చంద్రబాబు 2014 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, అమలు చేయని వాటిని గురించి వివరించే వీడియోలు, ఇతరత్రా విమర్శనాత్మక పోస్టింగ్‌లు పెడుతూ ప్రతి దాడికి పాల్పడుతోంది. ఇంతవరకు ఫర్వాలేదు గానీ ప్రస్తుతం సాగుతున్న సోషల్‌ మీడియా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతిపక్షపార్టీలకు చెందిన వారిని మానసికంగా కృంగదీయడమే లక్ష్యంగా అత్యంత జుగుప్సాకర పోస్టింగ్‌లతో దాడికి దిగుతోంది. కనీసం మహిళలన్న గౌరవభావం లేకుండా ప్రభుత్వ విధానాలను విమర్శించేవారిని సభ్య సమాజం తలదించుకునే రీతిలో అవమానిస్తూ నీచమైన పోస్టులు వైరల్‌ చేస్తోంది. ప్రజలను మరింత బలంగా నమ్మించేందుకు ఇటీవల ఈ ప్రచారశైలిని మార్పు చేశారు. ప్రింట్‌ మీడియాలో అచ్చుకాని వార్తలను, వాటిలో వచ్చినట్లుగా ఆయా పత్రికా లోగోలను జోడిరచి పాఠకులను, ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. ఇటువంటి పోస్టింగ్‌లను చూసి ప్రతి రోజూ పేపర్‌ చదివేవారు సైతం ఈ వార్త ఎప్పుడొచ్చిందబ్బా అని ఆశ్చర్యపోయే రీతిలో భ్రమింపజేస్తున్నారు. ప్రజల్లో విశ్వసనీయతకు మారుపేరుగా నిల్చిన విశాలాంధ్ర లోగోను సైతం ఈ సోషల్‌ మీడియా వీరులు వదిలిపెట్టలేదు. పత్రికలో రాని వార్తను వచ్చినట్లుగా లోగోను, డేట్‌లైన్‌ను జత చేసి ప్రతిపక్షనేతను టార్గెట్‌ చేశారు. ఈ వార్తను సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. మరో పత్రికలో ఇటీవల టీడీపీలో చేరిన ఒక దళిత నేతను లక్ష్యంగా చేసుకుని అతనిపై వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారు. మరో ప్రముఖ డిజిటల్‌ మీడియా వెబ్‌సైట్‌ లోగోను ఉపయోగించి టీడీపీ మహిళా నేతలను అసభ్యపదజాలంతో దూషిస్తూ ఒక సంచలన కథనాన్ని వైరల్‌ చేశారు. ఇలా ఒక్కో వారం ఒక్కోరకమైన పత్రికా లోగోలను వినియోగిస్తూ ప్రతిపక్షనేతలను కృంగదీసే చర్యలకు పాల్పడు తున్నారు. విచిత్రమేమిటంటే సోషల్‌ మీడియాలో ప్రభుత్వంపై చిన్నపాటి విమర్శనాత్మక పోస్టును ఫార్వర్డ్‌ చేసినా తీవ్రంగా స్పందించే సీఐడీ…మహిళలపై ఇంత దారుణ విషప్రచారం జరుగుతున్నా తమకేమీ తెలియనట్లు వ్యవహరించడంతో ఆ శాఖ తీవ్ర విమర్శల పాలవుతోంది. శృతిమించుతున్న ఈ సోషల్‌ మీడియా ప్రచారంపై ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి కట్టడి చేయకపోతే సమాజ పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img