Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దక్షిణాదిపై కమలం కన్ను

తొలుత తెలంగాణపై దృష్టి
టీడీపీతో మళ్లీ సఖ్యతకు యత్నం
2024 ఎన్నికల్లో మారనున్న రాజకీయ సమీకరణలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ అధిష్ఠానం దృష్టి సారిస్తోంది. మత అజెండానే కీలకంగా జనంలోకి చొప్పిస్తూ అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకున్న బీజేపీ, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం బలపడలేకపోతోంది. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ దక్షిణాదిలో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడిలాగే ఉంది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండగా, కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపధ్యంలో 2024 ఎన్నికల్లోనైనా దక్షిణాది రాష్ట్రాలపై కొంత పట్టు సాధించాలని కమలనాథులు ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలోభాగంగా తొలుత తెలంగాణపై దృష్టి పెడితే అధికారంలోకి రావడానికి అవకాశాలున్నాయని ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించడం, ఇటీవల టీఆర్‌ఎస్‌ నుంచి బైటకొచ్చిన ఈటల రాజేందర్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించడం, గత పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు గెలవడంతో పాటు, మరో ఇద్దరు అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చెందిన పరిస్థితులను కమలనాథులు విశ్లేషించుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు 45 నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉందని, మరో 20 నియోజకవర్గాలపై దృష్టి పెడితే అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాదని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అయితే ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడానికి అవసరమైన ఓటు బ్యాంకుపై ఇప్పుడు నేతలు దృష్టి పెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ మరలా అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్‌ కొట్టాలని తపన పడుతుండగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఈసారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న ధ్యేయంతో గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణ వైఎస్సార్‌ పార్టీ స్థాపించి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తుండడంతో, కాంగ్రెస్‌ శ్రేణులు తమ ఓటు బ్యాంకు చీలుతుందన్న ఆందోళనలో ఉన్నారు. దీనికితోడు సహజంగానే కాంగ్రెస్‌ పార్టీలో ఉండే అసంతృప్తి నేతలు దానికి మరింత ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒకరిద్దరు బలమైన నేతలు కూడా కాంగ్రెస్‌ పార్టీని వీడారు. ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి టీఆర్‌ఎస్‌కు బీజేపీయే సరైన పోటీ అనేవిధంగా రాజకీయ వాతావరణం తీసుకురాగల్గితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా కమలం వైపు మళ్లుతుందని బీజేపీ నేతలు ఆశపడుతు న్నారు. ఇందుకోసం తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బలమైన ఓటింగ్‌ కలిగిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం లాభిస్తుందని భావిస్తున్నారు. సుమారు 40 నియోజకవర్గాల్లో ఏపీకి చెందినవారు ఎక్కువ సంఖ్యలో స్థిరపడినట్లు గుర్తించారు. ఈ ఓటింగ్‌ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకునే రాజకీయ నిర్ణయానికనుగుణంగానే మరలుతుందని కమలనాథులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు టీడీపీ నేతలు ఎక్కువశాతం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆపార్టీ ఓటింగ్‌కు కూడా టీఆర్‌ఎస్‌ వైపు మళ్లింది. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి కారణం కావడంతో పాటు, ఇప్పటికీ సీఎం జగన్‌ను కేసీఆర్‌ ప్రోత్సహించడంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, చంద్రబాబుతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ద్వారా ఆ పార్టీ ఓటింగ్‌ను రాబట్టుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనుండగా, ఏపీలో 2024లో జరుగనున్నాయి. టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో లబ్ధి పొందడంతో పాటు, ఏపీలోనూ కొన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెల్చుకునే అవకాశం ఉంటుందని తెలుగు రాష్ట్రాలకు చెందిన కమలనాథులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే జనసేనతో కల్సి ప్రయాణం చేస్తున్నందున ఆపార్టీ ఓటింగ్‌ కూడా బీజేపీ అధికారం చేజిక్కించుకోవడానికి దోహదపడుతుందని చెపుతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటింగ్‌ పెరగడానికి టీడీపీతో పొత్తు మినహా ఎటువంటి అవకాశాల్లేవని వీరు చెప్పినట్లు సమాచారం. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు, సుదీర్ఘకాలం తర్వాత ఈనెల 6వ తేదీ ఆజాదీ అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీని కలిశారు. ఈసందర్భంగా వారిద్దరూ 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం రెండు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రానున్న ఎన్నికల్లో మళ్లీ రాజకీయ సమీకరణలు మారనున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img