Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

మెగా ట్రబుల్‌

. భోళా శంకర్‌ టికెట్ల ధరపై ఉత్కంఠ
. పెంపుదల కోసం నిర్మాత దరఖాస్తు
. తెరపైకి జగన్‌ సర్కారు నిబంధనలు
. పత్రాల సమర్పణలో జాప్యం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్‌ టికెట్ల ధరల పెంపుదలపై ఉత్కంఠ నెలకొంది. భోళా శంకర్‌ సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతివ్వాలంటూ ఏపీ స్టేట్‌ ఫిలిమ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ)కి చిత్ర నిర్మాతలు ఈ నెల ఒకటో తేదీన దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు అందజేయాలని కార్పొరేషన్‌ నిర్మాతలను కోరింది. అయితే, ఈ వివరాలు అందజేయకపోవడంతో టికెట్ల ధరపై అయోమయం ఏర్పడిరది. గతంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రానికి ఇదే తరహాలో టికెట్ల పెంపుదలకు ఏపీ ఎఫ్‌డీసీకి ఆ చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసి, వాటికి అవసరమైన పత్రాలు అందజేశారు. భోళా శంకర్‌ చిత్ర నిర్మాతలు మాత్రం ఇంకా 11 రకాల పత్రాలను గురువారం సాయంత్రం వరకు ఇవ్వలేదు. దీంతో చిరంజీవికి, ఆయన అభిమానులకు ప్రభుత్వం రaలక్‌ ఇచ్చినట్లయింది. తాజాగా వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజుల వేడుకల్లో జగన్‌ ప్రభుత్వంపై చిరంజీవి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. చిత్ర పరిశ్రమకు చెందిన హీరోల పారితోషికాలపై రాజ్యసభలో సినిమాటోగ్రఫీ బిల్లుపై చర్చించిన అంశాన్ని ఆయన తప్పుపట్టారు. వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆ బిల్లుపై సమగ్రంగా చర్చిస్తూ హీరోల పారితోషికాలను నియంత్రించాలన్నారు. దీనిని ఉద్దేశించే చిరంజీవి వ్యాఖ్యలు చేసినట్లు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవగతమైంది. దీంతో రెండు రోజులపాటు చిరంజీవి వ్యాఖ్యల్ని వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. అనేకచోట్ల చిరంజీవి అభిమానులు సైతం వైసీపీ నేతలపై నిరసనకు దిగారు. ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుడివాడలో చిరంజీవి అభిమానులు ఆందోళన చేశారు. ప్రసార మాధ్యమాల ద్వారా చిరంజీవి అభిమానులు, వైసీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం, పరస్పర దూషణలు నడిచాయి. ఈ వ్యవహారానికి తెరపడిరదనే లోపు, చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్‌కు కష్టాలు వచ్చి పడ్డాయి. టికెట్ల ధరల పెంపుపై ఏపీ ఎఫ్‌డీసీ పత్రాలు అడగడం ద్వారా చిరంజీవిని, చిత్ర నిర్మాతలను ఇరుకున పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి.
ఏపీ ఎఫ్‌డీసీ నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి…
జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ ఎఫ్‌డీసీలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి… చిత్ర పరిశ్రమకు సంబంధించి వివిధ కీలక నిర్ణయాలు, టికెట్ల ధరల అంశాల్ని పరిగణనలోకి తీసుకుంది. రూ.100 కోట్లు, ఆపైన నిర్మించే చిత్రాలను భారీ చిత్రాలుగా పరిగణిస్తోంది. వాటికి కొన్ని రోజులు టికెట్ల ధరలు పెంచుకునేందుకు షరతులతో వెసులుబాటు కల్పించింది. ఆ చిత్రం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌ జరపాలన్నది మరో నిబంధన. చిత్ర నిర్మాతల బ్యాంకు పత్రాలు, ఐటీ రిటర్న్‌లు, జీఎస్టీ తదితర పత్రాలు ఇవ్వాల్సి ఉంది. వాటిని ఇవ్వడంలో భోళా శంకర్‌ నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఏపీ ఎఫ్‌డీసీ అడిగిన 11 రకాల పత్రాలను అందజేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. చిరంజీవి ఆ తరహా వ్యాఖ్యలు చేయకపోతే…భోళా శంకర్‌కు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేది కాదేమోననే ప్రచారముంది. ఎంపీ విజయసాయిరెడ్డి సైతం చిరంజీవిని విమర్శిస్తూ పరోక్షంగా కౌంటర్‌ ట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. చిత్ర రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదని, చిత్ర హీరోలు అయినా, రాజకీయవేత్తలు అయినా ప్రజలు ఆదరిస్తేనే మనుగడ ఉంటుందని, చిత్ర పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వారి యోగక్షేమాలు పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు. సినిమాటోగ్రాఫ్‌ బిల్లుపై పార్లమెంట్‌లో మాట్లాడితే కోట్లకు పడగెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటున్నారని, సినీ పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, చిత్ర కార్మికుల సంక్షేమం, చిత్ర పరిశ్రమలో మహిళల భద్రత అంతే ముఖ్యమన్న మాటలకు ఉలుకెందుకని ట్విట్టర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలను జగన్‌ ప్రభుత్వం తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఆదాయ పత్రాల్లో హీరోల పారితోషికాలు
చిత్ర నిర్మాతలు సమర్పించే తమ బడ్జెట్‌ వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో ఆయా చిత్రాలకు అయిన ఖర్చులతోపాటు హీరోల పారితోషికం వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో హీరోల పారితోషికంపై వైసీపీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ పారితోషికంపై ఆదాయ ధ్రువీకరణ పత్రాల ద్వారా లెక్కలు తేల్చాలంటూ నిలదీస్తున్నారు. బ్రో చిత్రానికి మొత్తం రూ.60 కోట్ల ఖర్చయితే…అందులో పవన్‌ కల్యాణ్‌కే రూ.50 కోట్ల పారితోషికం ఇచ్చారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్‌ తన పారితోషికంలో కేవలం కొంత ఆదాయ పన్నులకు అనుగుణంగా తీసుకుని, మిగిలిన ఎక్కువ మొత్తం నేరుగా తీసుకుంటారని, దాంతో ఆదాయ శాఖకు రావాల్సిన పన్నును ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. ఇదే సమయంలో రాజ్యసభలో సినీ ఆటోగ్రఫీపై చర్చ జరగడం, ఆ తర్వాత దానిపై చిరంజీవి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఇప్పుడు భోళా శంకర్‌ చిత్ర నిర్మాతలు తమ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వానికి సమర్పిస్తే… అందులో చిరంజీవికి ఇచ్చే రెమ్యునరేషన్‌ వెల్లడయ్యే అవకాశముంది.
అతి తక్కువుగా చూపినా, ఎక్కువుగా చూపినా అది నిర్మాతల మెడకు చుట్టుకునే ప్రమాదముంది. అందువల్ల భోళా శంకర్‌ చిత్ర నిర్మాతలు ధ్రువీకరణ పత్రాలను ఏపీ ఎఫ్‌డీసీ కార్యాలయానికి చిత్రం విడుదల సమయానికి ముందు సమర్పిస్తారా… లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ పత్రాలు సమర్పించిన తర్వాతే భోళా శంకర్‌ టికెట్ల ధరల పంచాయితీ తేలే అవకాశం కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img