Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. నైరుతి, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవన ద్రోణి తూర్పుభాగం వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్యదిశగా గాలులు వీస్తోంది. ఈ ప్రభావంతో నేడు కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల మూడు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని.. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వానలు కురుస్తాయంటోంది. ఈనెల 6 వరకు రాష్ట్రంలో ఎక్కువచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని తెలిపారు.మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగింది. సోమవారం రాష్ట్రంలో అనేక చోట్ల ఉక్కపోత, వేడి వాతావరణంతో జనాలు అల్లాడిపోయారు. జంగమహేశ్వరపురంలో 39.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం విభిన్న వాతావరణం కనిపించగా.. కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా భారీవర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.అలాగే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా బీఆర్ అంబేద్కర్ తెలిపారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం 8 గంటల్లోపు పలు మండలాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

బుధవారం విషయానికి వస్తే.. పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు మంగళ, బుధవారాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని.. ఒకట్రెండు చోట్ల 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అలర్ట్ చేసింది.విజయవాడలో సోమవారం విభిన్న వాతావరణం కనిపించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచి ఎండలు మండిపోగా.. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. విజయవాడలో కూడా నైరుతి రుతుపవనాలు వచ్చాక రెండు, మూడు రోజులే వర్షాలు కురిశాయి. ఆ తర్వాత మళ్లీ వాతావరణం మారిపోయింది.. ఉష్ణోగ్రతలు పెరిగాయి. మళ్లీ సోమవారం వర్షం ఒక్కసారిగా కురవడంతో జనాలు ఉపశమనం పొందారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img